నగరంపాలెం: స్కూటీలు దొంగలించే ముఠాను లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.20 లక్షలు విలువ చేసే 21 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల గుంటూరు నగరంలోని రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, ఇళ్ల ఎదురు నిలిపిన స్కూటీల చోరీలపై వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో చోరులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా వేశారు. సోమవారం సాయంత్రం మార్కెట్ సెంటర్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు. నల్లచెరువు 20/2వ అడ్డరోడ్డులో ఉంటున్న కార్పెంటర్ షేక్ కరిముల్లా అలియాస్ డిప్పల్, నల్లచెరువుకి చెందిన ఏసీ మెకానిక్ షేక్ మదార్వలి అలియాస్ సోహెల్, నల్లచెరువు 23/2వ అడ్డరోడ్డులో ఉంటున్న వాటర్ ప్లాంట్ వర్కర్ షేక్ జాఫర్సాదిక్, సంపత్నగర్ రెండో వీధికి చెందిన మటన్ వర్కర్ షేక్ మస్తాన్వలి, ప్లంబర్ పనిచేసే నల్లచెరువుకి చెందిన ఓ మైనర్, ఇద్దరు రిసీవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.20 లక్షల విలువ చేసే 21 స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. చెడు అలవాట్లకు బానిసైన ఐదుగురు ముఠాగా ఏర్పడి, ఎక్కువగా సుజుకి యాక్సెస్ స్కూటీల హ్యాండిళ్లను పగులకొట్టి, బ్యాటరీ వైర్లకు పిన్నీసుతో నేరుగా కనెక్షన్ ఇచ్చేసి వాహనాలతో ఉడాయించేవారు. దొంగలించిన వాహనాలను మేడికొండూరు, తురకపాలెంలోని ఇద్దరు రిసీవర్లకు విక్రయించేవారు. ఒక్కొక్కటి రూ.20 వేలకు విక్రయించినట్లు పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరు రిసీవర్లు కొనుగోలు చేసిన స్కూటీల నంబర్ ప్లేట్లను తొలగించి, అధిక మొత్తానికి చత్తీస్ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు కంటైనర్ల ద్వారా తరలించేవారు. పొరుగు రాష్ట్రాల్లో విక్రయించిన ఎనిమిది సుజుకి స్కూటీలను సైతం గుంటూరు తీసుకొచ్చామని ఎస్పీ అన్నారు. స్కూటీలను యాజమానులకు అప్పగిస్తామని తెలిపారు. లాలాపేట పీఎస్, పాతగుంటూరు పీఎస్, నల్లపాడు పీఎస్, పట్టాభిపురం పీఎస్తోపాటు పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణ పీఎస్ పరిధిలో చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. ఆయా కేసుల్లో ప్రతిభ చూపిన గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారాం, లాలాపేట పీఎస్ సీఐ శివప్రసాద్, మహిళా ఎస్ఐ సిహెచ్.ప్రవీణ, హెచ్సీ ఎం.కల్యాణ్, కానిస్టేబుళ్లు పి.కిరణ్కుమార్, పి.శంకర్, ఆర్.ఆంజనేయులు, ఎం.మల్లికార్జునరావులను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు.


