స్క్రీనింగ్‌ పరీక్షతో రొమ్ము క్యాన్సర్‌కు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

స్క్రీనింగ్‌ పరీక్షతో రొమ్ము క్యాన్సర్‌కు చెక్‌

Oct 14 2026 4:29 AM | Updated on Oct 14 2026 4:29 AM

● ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు బాధితులే ● ప్రతి ఏడాది పెరుగుతున్న కేసులు ● అక్టోబర్‌ నెల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహన మాసం

ఉచితంగా ఆపరేషన్లు

స్క్రీనింగ్‌ పరీక్ష కీలకం

గుంటూరు మెడికల్‌: ఆధునిక జీవన శైలి పెరిగింది. ఉరుకులు పరుగుల జీవితం. 25 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్‌ బాధితులుగా మారుతున్నారు. విద్యావంతులు, చదువులేనివారు అనే తేడా లేదు. నిర్లక్ష్యంగా ఉండటం వలన ప్రతి ఏడాది కేసులు పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది అక్టోబర్‌ నెలను బ్రెస్‌ క్యాన్సర్‌ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు.

వ్యాధి కారణాలు

జన్యుపరమైన కారణాలు. వాతావరణంలో వస్తున్న మార్పులు. అధిక బరువు. ఆల్కహాల్‌, పొగాకు వినియోగం. 30 ఏళ్ల వరకు గర్భం దాల్చకపోవడం. అసలు గర్భం దాల్చని వారికి ముప్పుపొంచిఉంది. చిన్న వయసులోనే రజస్వల అవ్వటం, ఆలస్యంగా నెలసరి ఆగిన వారికి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరికై నా క్యాన్సర్‌ ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం. సంతానం అప్పుడే వద్దు అనుకొని దంపతులు మందులు వాడకం వలన రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. రొమ్ములో ఉండే ప్రతి గడ్డ క్యాన్సర్‌ గడ్డ కాదు. అయితే ప్రతి గడ్డను కూడా అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవటం ద్వారా నిర్ధారించుకోవచ్చు.

లక్షణాలు ఏమంటే..

రొమ్ము, చంకలో గడ్డలు ఉంటే అనుమానించాలి. రొమ్ములపై చర్మం ముడతలు పడటం. గట్టిగా మారడం, గుంతలు పడటం. నారింజ రంగులోకి మారితే అనుమానించాలి. చనుమొనలు నొక్కితే సరిగా లోపలికి వెళ్లకపోయినా, సైజుల్లో తేడాలు ఉన్నా వైద్యులను సంప్రదించాలి. చనుమొనల నుంచి తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఏదైనా ద్రవం బయటకు వస్తే రొమ్ము ఛాతిపై ఉన్న చర్మం లోపలికి వెళ్లి చర్మం చొట్టలు పడుతుంది. బ్రెస్ట్‌ నిపుల్స్‌ చుట్టూ ఉండే చర్మం పొలుసులుగా మారి రాలి పోతుంది.

మెమోగ్రామ్‌ పరీక్షలు చేయించుకున్నవారి వివరాలు ...

జీజీహెచ్‌లో రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్ష మెమోగ్రామ్‌ 2023లో 368 మంది, 2024లో 381 మంది, 2025లో 425 మంది ఉన్నారు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ 2022లో 34 మంది, 2023లో 73 మంది, 2024లో 69 మంది, 2025లో 87 మంది రొమ్ము క్యాన్సర్‌ ఆపరేషన్‌ చేయించుకున్నారు.

నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో ఉచితంగా క్యాన్సర్‌ ఆపరేషన్లు చేస్తున్నాం. కొంత మందికి ప్రాథమిక దశలోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించి ప్రాణాంతకం కాకుండానే వ్యాధి నుంచి విముక్తి కల్పించాం. 24 గంటలు కార్పొరేట్‌ ఆస్పత్రుల కంటే ధీటుగా వైద్యసేవలు ఉన్నాయి. చివరి దశలో ఉన్నవారు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు వంద పడకలతో మరో క్యాన్సర్‌ సెంటర్‌ నిర్మాణం జీజీహెచ్‌లో చేస్తున్నాం.

– నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిండెంట్‌

క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు తప్పనిసరిగా మహిళలంతా మెమోగ్రామ్‌, బయాప్సి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికై నా క్యాన్సర్‌ ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా ముందస్తుగా జనటిక్‌ పరీక్ష చేయించాలి. మగవారికి కూడా రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా వీరు కూడా స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్‌లకు రేడియేషన్‌ థెరఫీ, కిమో థెరఫీ, ఆపరేషన్‌లు అందుబాటులో ఉన్నాయి.

–డాక్టర్‌ బైరపనేని స్రవంతి, క్యాన్సర్‌ వైద్య నిపుణులు, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement