కేంద్ర ప్రతినిధుల బృందం సందర్శన | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రతినిధుల బృందం సందర్శన

May 7 2026 7:56 AM | Updated on May 7 2026 7:56 AM

కేంద్ర ప్రతినిధుల బృందం సందర్శన

తెనాలి: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని జనాభా పరిశోధన కేంద్రం ప్రతినిధి బృందం తెనాలి చెంచుపేటలో గల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని జిల్లా సత్వర చికిత్సాలయం (డైక్‌) సెంటర్‌ను సందర్శించింది. ‘రాష్ట్రీయ బాల స్వస్థ’ కార్యక్రమం అమలుపై పరిశీలనకు నాలుగురోజులపాటు ఈ బృందం షెడ్యూలును నిర్ణయించింది. తొలిరోజున గుంటూరును సందర్శించింది. రెండో రోజైన బుధవారం తెనాలి ‘డైక్‌’ను పరిశీలించింది. అనంతరం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిపారు. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని జనాభా పరిశోధన కేంద్రం సీనియర్‌ రీసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ వై.రమణ నేతృత్వంలోని బృందం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాలుగు ప్రధాన అంశాలపై సమీక్షించారు. పిల్లల పుట్టుకలో లోపాలు, వ్యాధులు, కొరతలు, ఎదుగుదల లోపాలు, వైకల్యం అంశాలను ముందుగా గుర్తించటంపై సమీక్షించారు. రిఫరల్‌ మెకానిజం బలోపేతం చేయటం ద్వారా నిర్ణీత సమయాల్లో పరిశీలన చేయటం, ‘డైక్‌’ ద్వారా మెరుగైన సేవలను అందించటం, క్షేత్రస్థాయి సవాళ్లపై చర్చించారు. అధికారుల సమన్వయం, నివేదించటంపై తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సౌభాగ్యవాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అన్నపూర్ణ, ‘డైక్‌’ పీడియాట్రిషన్‌ డాక్టర్‌ మధుబాబు, డైక్‌ మేనేజరు శిరీష తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement