బాపట్ల: జిల్లాలో కొనసాగుతున్న అన్ని అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వారాంత ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఖనిజ ఫౌండేషన్ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, వీక్లీ డెవలప్మెంట్ ఫొటోలు ఎందుకు అప్‌డేట్ చేయలేదని గనుల శాఖ అధికారిని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మల్లికార్జునరావు, మార్కెటింగ్ శాఖ ఏడడీరమేశ్ బాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంతరాజు, జిల్లా గనుల శాఖ ఏడీ శ్రీనివాస్, విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు మంచి పేరు తేవాలి
బాపట్ల: బాగా చదివి జిల్లాకు మంచి పేరు తెచ్చారని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల వసతి గృహాలలో విద్యనభ్యసిస్తూ పది, ఇంటర్మీడియట్ పరీక్షలలో అధికంగా మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ బుధవారం అభినందించారు. ప్రశంసా పత్రాలు, పతకాలతో విద్యార్థులను ఆయన సత్కరించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో ఉంటూ అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమని చెప్పారు.
చిత్తశుద్ధితో పని చేయాలి
స్వర్ణ బాపట్లలో వివరాలను గుర్తించి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వర్ణ బాపట్ల సేవా సేతు, జాతీయ, రాష్ట్రీయ రహదారుల నిర్మాణాలపై అనుబంధ శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. బాపట్ల సూర్యలంక బీచ్‌ను గోవా బీచ్‌ను మించిన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. బుధవారం పర్యాటక, వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్, వికలాంగుల సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ లోని పలు ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.


