అచ్చంపేట: మార్చిలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు విద్యార్థులను బ్లూబెల్స్ పాఠశాల యాజమాన్యం బుధవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం మేరీ శ్రీలత మాట్లాతూ 595మార్కులు సాధించిన పెద్దింటి సైదేశ్వరరావు, 593 మార్కులు సాధించిన మద్దుల శ్రీలక్ష్మిలను ప్రోత్సహించేందుకు, మిగిలిన విద్యార్థులకు ప్రేరణ కల్పించడంలో భాగంలోనే విమాన ట్రిప్పు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి యేటా తమ పాఠశాల విద్యార్థులు నూరుశాతం విత్తీర్ణత సాధిస్తున్నారన్నారు.
కారెంపూడి: బైక్ వరిగడ్డి ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వేపకంపల్లి గ్రామ రోడ్డు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. కారెంపూడికి చెందిన నెమలికంటి రామాంజనేయులు తెలంగాణ రాష్ట్రం వాడపల్లి నుంచి బైక్‌పై స్వగ్రామం కారెంపూడి వస్తున్నారు. దాచేపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి సమీప ప్రాంతంలో ఆగి ఉన్న వరిగడ్డి ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్నారు. దీంతో బైక్‌పై ఉన్న రామాంజనేయులు (42) తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామాంజనేయులుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనతో కారెంపూడి గ్రామంలో విషాదం అలుముకుంది. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మృతుని కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.
తిరుపతమ్మ ఆలయానికి రూ.4,37,500 ఆదాయం
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారి ఆలయానికి సంబంధించి సుబ్బాయిగూడెం గ్రామ పరిధిలో ఉన్న 17.53 ఎకరాల మెరక భూమిని రెండు సంవత్సరాల కాలపరిమితితో కౌలు చేసుకునేందుకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. పంచా యతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేలం ద్వారా ఆలయానికి రూ.4,37,500 ఆదాయం వచ్చిందని ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. గత వేలంలో రూ.6,88,646 ఆదాయం రాగా ఈ సారి రూ.2,51,146 తగ్గింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
ముస్లిం విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పెనమలూరు: ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు చేరేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న తాలీం–ఎ–హునూర్ టాలెంట్ పరీక్షకు దరఖాస్తు చేయాలని వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ కరీముల్లాబాషా బుధవారం సూచించారు. ఈ టాలెంట్ టెస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.


