గుంటూరు వెస్ట్: కలెక్టరేట్ కార్యాలయ ఆఫీస్ సబార్డినేట్ పై నగరపాలెం పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీఆర్‌ఎస్‌ఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సదరు పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ, డీఆర్వోలకు వినతిపత్రం అందజేసారు. కిరణ్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి కలెక్టరేట్ సమీపంలో (ఆఫీస్ సబార్డినేట్) వాచ్‌మెనన్‌గా పని చేస్తున్న జి.సురేష్ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సురేష్ తాను కలెక్టరేట్ వాచ్‌మన్ అని, విధులకు ఆలస్యమవుతుందని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదని, ఈ క్రమంలో బైక్ ముందుకు నడుపుతుండగా ఏఎస్‌ఐ కాలికి టైరు ఆనుకుందని వివరించారు. వెంటనే అక్కడ సివిల్ డ్రెస్సులో ఉన్న కానిస్టేబుల్ లాఠీతో సురేష్ చెవిపై బలంగా కొట్టడంతో తీవ్రగాయమైందని, సురేష్ చేతిలో ఉన్న ఫోన్, బైక్ లాగేసుకుని పంపించేసారన్నారు. వెంటనే కలెక్టరేట్ ఏఓకి సమాచారం అందడంతో సిబ్బందిని అప్రమత్తం చేసి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు. సహచర ఉద్యోగుల పట్ల ఇటువంటి చర్యలు ఎంతమాత్రం తగవని, ఇవి ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనకు కారణమవుతాయని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని కలెక్టరేట్ ఉద్యోగస్తులు విస్తుపోతున్నారన్నారు. కొందరు పోలీస్ అధికారుల దుందుడుకు చర్యలు మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డపేరు తెస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులపై దాడులను ఏపీఆర్‌ఎస్‌ఏ సహించబోదని స్పష్టం చేశారు. గాయపడిన సురేష్‌కు పూర్తి వైద్యం అందించాలని, దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌పై, అనుచితంగా ప్రవర్తించిన ఏఎస్‌ఐల పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ స్పందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి వెంకట్రావు, రాష్ట కార్యదర్శి దివ్య దుర్గాదేవి, సిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రటరీ బాలాజీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలని జేసీకి
ఉద్యోగ సంఘాల ఫిర్యాదు


