కర్లపాలెం: శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన తిరునాళ్ళ మహోత్సవం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరునాళ్లలో స్వామివారి ఆలయ జండాతో పాటు గ్రామంలో భక్తుల మొక్కుబడుల జండాలు ప్రత్యేకంగా అలంకరించిన 20 ట్రాక్టర్‌లపై ఉంచి మంగళ వాయిద్యాలు, కనక తప్పెట్లతో గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారి జండాలకు మహిళలు హారతులిచ్చి పూజలు చేసి టెంకాయలు సమర్పించారు. గ్రామోత్సవంలో స్వామివారి జండాలు ఏట్రవారిపాలెం నుంచి పాతనందాయపాలెం డొంకమీదుగా కర్లపాలెం ఐలాండ్ సెంటర్ వరకు అక్కడి నుంచి తిరిగి ఊరేగింపు చేస్తూ స్వామివారి గుడి వద్దకు తీసుకువచ్చి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయించి రావిచెట్టుకు జండాలను ప్రతిష్టించారు. తిరునాళ్ళలో భాగంగా ఆలయానికి రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించటంతో పాటు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధనరెడ్డి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తిరునాళ్లకు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చి తిరునాళ్ళలో ప్రధాన ఘట్టమైన స్వామివారి మొక్కుబడి జండాల ఊరేగింపు తిలకించి స్వామిని దర్శించుకుని పూజలు చేసి రావి చెట్టు వద్ద కొబ్బరి కాయలు కొట్టారు. ఆలయం వద్ద ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మురళీ కోలాటం భజన భక్తులను ఆకట్టుకున్నాయి. తిరునాళ్లలో ఎలాంటి అల్లర్లు జరగకుండా స్థానిక ఎస్‌ఐ రవీంద్ర తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.


