జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్
నిషేధిత భూముల జాబితాలో
మార్పులకు చర్యలు
బాపట్ల: నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించే ప్రక్రియ ప్రారంభించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించే ప్రక్రియపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించడం, భూమి యజమానులకు హక్కు కల్పిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 410 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. అందులో 107 అర్జీలకు సంబంధించిన భూములను తొలగించి, భూమి యజమానులకు యాజమాన్య హక్కు కల్పించామని చెప్పారు. ఇ–భూమి, వెబ్ ల్యాండ్, వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రెవెన్యూ దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. జిల్లాస్థాయి కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి విచారణతో పూర్తిగా పరిష్కరిస్తున్నామని వివరించారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు వందలాది ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించామని చెప్పారు. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. దశలవారీగా 22ఏ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. వారంలో రెండు పర్యాయాలు జిల్లా స్థాయి కమిటీ సమావేశమై పరిశీలన, విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెవెన్యూ అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. కొల్లూరు, యద్దనపూడి, చిన్నగంజాం, మార్టూరు, కారంచేడు, కర్లపాలెం, చెరుకుపల్లి, పర్చూరు, చుండూరు, భట్టిప్రోలు మండలాలలో సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కనీసం ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నందుకై నా పనిచేయరా అని నిలదీశారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలని మార్గ నిర్దేశం చేశారు. జిల్లాస్థాయి కమిటీలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్ పాల్గొన్నారు.


