గుంటూరు ఎడ్యుకేషన్: మార్కెట్ సెంటర్‌లోని హిందూ హైస్కూలులో పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య శిబిర ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు రవాణా సదుపాయం తదితర వివరాలపై ఆరా తీశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను పక్కాగా అమలు చేయడంతోపాటు పరీక్షలు జరుగుతున్న రోజుల్లో పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ దుకాణాలను మూసి వేయించాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ 149 కేంద్రాల పరిధిలో నిరంతరం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్, శాఖాధికారులు పాల్గొన్నారు.


