కట్టుకున్న భార్యే కడతేర్చింది | - | Sakshi
Sakshi News home page

కట్టుకున్న భార్యే కడతేర్చింది

Mar 24 2026 7:55 AM | Updated on Mar 24 2026 7:55 AM

కట్టుకున్న భార్యే కడతేర్చింది మృతదేహానికి రాయి కట్టి చెరువులో పడేసిన కేసులో వీడిన మిస్టరీ

సోదరి, ఆమె భర్త, మరో మైనర్‌తో కలిసి కొట్టి చంపిన భార్య నిందితురాలితోపాటు మరో ముగ్గుర్ని అరెస్ట్‌ చేసిన ప్రత్తిపాడు పోలీసులు

మృతదేహానికి రాయి కట్టి చెరువులో పడేసిన కేసులో వీడిన మిస్టరీ

నగరంపాలెం: ఈనెల 19వ తేదీన యనమదల / ఈదులపాలెం గ్రామాల పరిధిలోని ఎన్‌హెచ్‌ 16 సమీపానున్న చెరువులో నడుముకు రాయికట్టి గోనెసంచిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం తాలూకా మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఉన్న భర్తను తాడుతో కట్టేసి, కర్రలతో కొట్టి భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసులో మృతుడి భార్య, మరో ముగ్గుర్ని ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. ఈనెల 19న మృతుడి నడుంకు రాయిని తాడుతో కట్టి, గోనెసంచిలో పెట్టిఉంచారని అందిన సమాచారం మేరకు.. ప్రత్తిపాడు పీఎస్‌ సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ నరహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతన్ని ఎవరైనా హత్య చేసి ఉంటారని, ఆ దిశగా దక్షిణ సబ్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ మధుసూదన్‌రావు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గుంటూరు దాసరిపాలెం గ్రామంలోని ఓ కుటుంబం ఇంటి సామగ్రి, పశువులతో పరారవుతున్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు రూరల్‌ మండలం దాసరిపాలెం ప్లాట్స్‌లో ఉంటున్న తెనాలి ఐతానగర్‌ బత్తులవారివీధికి చెందిన ఉప్పుతల్ల లక్ష్మి అలియాస్‌ తన్నీరు తిరుపతమ్మ, ప్రస్తుతం తెనాలి పెదరావూరులో ఉంటున్న చౌడవరం సీఆర్‌నగర్‌కు చెందిన భార్యభర్తలు సిద్ధి అంకమ్మ, సురేష్‌, పేరేచర్ల లక్ష్మీనరసింహకాలనీ ఐదో వీధికి చెందిన ఓ మైనర్‌గా గుర్తించారు. చెరువులో మృతదేహం తన్నీరు వెంకటేశ్వర్లు (30)గా గుర్తించి, మృతురాలి భార్య తిరుపతమ్మ, ఆమె సోదరి అంకమ్మ, భర్త సురేష్‌, సోదరుడు మైనర్‌ను అరెస్ట్‌ చేశారు. హత్యకు వాడిన కరల్రు, ఇనుప పలుగు, పారలు, మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

హత్య చేశారిలా..

వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై, భార్య తిరుపతమ్మను శారీరక, మానసికంగా వేధించేవాడు. పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేసినా అతనిలో మార్పురాలేదు. ఈనెల 17న వెంకటేశ్వర్లు, తిరుపతమ్మకు మళ్లీ వివాదం నెలకొంది. దీంతో తిరుపతమ్మ ఆతన సోదరి, బావ, మైనర్‌లకు సమాచారం అందించింది. దీంతో భార్య, ఆ ముగ్గురు కల్సి వెంకటేశ్వర్లను తాడుతో కట్టేసి, కరల్రతో తీవ్రంగా కొట్టగా మృతిచెందాడు. తొలుత భర్త మృతదేహన్ని ఇంట్లో పూడ్చాలని అనుకున్నా, స్థానికులకు అనుమానం వస్తుందని భావించారు. దీంతో మిరపకాయల గోనె సంచిలో మృతదేహం వేసుకుని మోటార్‌సైకిళ్లపై తీసుకెళ్లి చెరువులో పడవేశారు. అయితే మృతదేహాం పైకి తేలకుండా నడుముకు రాయిని తాడుతో కట్టేసి చెరువులో వేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసుని చేధించిన సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ నరహరి, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. సమావేశంలో దక్షిణ ఇన్‌ఛార్జ్‌ డీఎస్పీ మధుసూదన్‌రావు, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement