
ఖాతాదారులకు బురిడీ
ఈఎంఐలు చెల్లించినా ఇవ్వని రసీదులు సంస్థ చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం పోలీసులను ఆశ్రయించిన ఖాతాదారులు
బాపట్ల టౌన్: బాపట్ల పట్టణంలోని ఏజీ కళాశాల రోడ్డులో ఏర్పాటు చేసిన హెచ్‌ఎంఎఫ్‌ఎల్ (హిందూస్థాన్ మైక్రోఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెట్) పరిధిలో బాపట్ల జిల్లాలోని సుమారు 350 మందికిపైగా ఖాతాదారులు వివిధ రూపాలలో రూ. కోట్లలో రుణాలు తీసుకున్నట్లు సమాచారం. విడతలవారీగా ఈఎంఐలు చెల్లించినప్పటికీ అవి సంస్థ ఖాతాలో జమ చేయటం లేదనే ఆరోపణలు వచ్చాయి. ఖాతాదారులు వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగి తమ అకౌంట్‌లకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో తిరుగు పయనమవుతున్నారు.
ఉన్నతాధికారులను కలిసినా ఫలితం శూన్యం
ఈఎంఐలు చెల్లించినప్పటికీ తమ అప్పు యథావిధిగా ఉందనే విషయం తెలుసుకున్న ఖాతాదారులు సదరు మేనేజర్ తీరుపై విజయవాడ రీజినల్ మేనేజరు షేక్ సైదులుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆడిటర్ సమక్షంలో బాపట్ల బ్రాంచ్‌ను సందర్శించి సదరు మేనేజర్ తీరుపై ఆయన విచారించారు. వారి విచారణలో ఈ ఏడాది ఆగస్టు 31న జమ చేయాల్సిన రూ. 5,06,384, సెప్టెంబర్ 20లోపు జమ చేయాల్సిన రూ. 5,22,212లు జమ చేయలేదని తేలినట్లు సమాచారం.
రూ.2.23 లక్షలు చెల్లించినా రూ.40,400కే రసీదులు
కర్లపాలెం మండలంలోని గణపవరం పంచాయతీ కేసరపూడి కాలనీకి చెందిన తాడిశెట్టి లక్ష్మితిరుపతమ్మ గ్రామంలో రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. అప్పట్లో రూ. 7 లక్షల అప్పు అయ్యింది. దానిని తీర్చేందుకు ఇంటిని హెచ్‌ఎంఎఫ్‌ఎల్‌లో తనఖా పెట్టి రూ. 7.50 లక్షల రుణం తీసుకున్నారు. నెలకు రూ. 20,200 చొప్పున చెల్లించారు. ఇప్పటివరకు 11 నెలలకు రూ. 2.23 లక్షలు చెల్లించినా కేవలం రూ. 40,400 చెల్లించినట్లు రసీదులు ఇచ్చారని ఆమె వాపోయారు. ఇదేమని సిబ్బంది రామకృష్ణ, నూరేళ్ళను అడిగితే తమ మేనేజర్ రాజశేఖర్ జమ చేయడం లేదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజర్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తే అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. గురువారం మేనేజర్‌పై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.