
జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
బాపట్ల: స్వచ్ఛతా ిహీ సేవల్లో బాపట్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. 461 గ్రామాల్లో మురికి కూపాలుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయాలని ఆదేశించారు. జిల్లాకు 342 సామాజిక మరుగుదొడ్లు మంజూరు కాగా, నేటి వరకు 223 మొదలు పెట్టకపోవడం ఏమిటని ఆరా తీశారు. ముఖ్యంగా పురపాలక సంఘాలలోని ప్రధాన కాల్వలన్నిటీలో పూడికతీత పనులు చేపట్టాలని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని తాగునీటి చెరువులని క్లోరినేషన్ చేయాలన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ వారంలో మూడు రోజులు సంబంధిత గ్రామాల్లో క్షేత్ర పరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఇంచార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, ఆయా శాఖల జిల్లా అధికారులు, డీపీఓ ప్రభాకర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పాల్గొన్నారు.
చీరాల ఆర్డీఓ
తూమాటి చంద్రశేఖర నాయుడు
చీరాల టౌన్: పర్యావరణ పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చీరాల మున్సిపాలిటీలో అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నుంచి పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు ప్రకటించారు. గురువారం తన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, చీరాల తహసీల్దార్ సమక్షంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 నుంచి మున్సిపల్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో పాటుగా కవర్లు వినియోగం, అమ్మకం, నిల్వలు, తయారీ, పంపిణీలను పూర్తిగా నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడకం, అమ్మకాలు, పంపిణీ చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులంతా ఆదేశాలను తప్పక పాటించాలని ఆయన ఆదేశించారు.
గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
చీరాల మున్సిపాలిటీలో గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యజమానులు వాటిని పబ్లిక్ స్థలాల్లో వదలకూడదని చెప్పారు. గోవుల సమస్యలను పరిష్కరించేందుకు వాటికి పునరావాసంతో పాటు గుర్తింపు కూడా చేస్తున్నామని వివరించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో గోవులను సంరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ పాల్గొన్నారు.