
సమర్థంగా ప్రభుత్వ పథకాల అమలు
ప్రతి రైతుకూ యూరియా పంపిణీ
అధికారులకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశం
బాపట్ల: జిల్లాలో సూపర్ సిక్స్ పథకాలను సమర్థంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం పథకాల అమలుపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరువు చేయడానికి కృషి చేయాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ, ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాలను అర్హులందరికీ అందజేయాలని చెప్పారు. జిల్లాలో సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, డిపోల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా మరుగు దొడ్లు నిర్మించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆ శాఖ అధికారులకు చెప్పారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం రుచిగా, సుచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని హాస్టళ్లలో మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఆయన చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ లవన్న, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం పాల్గొన్నారు.
పరిశుభ్రతతోనే ఆరోగ్య సమాజం
చీరాల అర్బన్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. గురువారం చీరాల పట్టణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు కలెక్టర్ అధికారులతో కలిసి చీపురు చేతపట్టి, రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారు స్వయంగా చీపుర్లు చేత పట్టాలన్నారు. పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా పరిశుభ్రత ప్రాధాన్యాన్ని ఇతరులకు తెలియచెప్పే ప్రయత్నం చేయాలని తెలిపారు. రోడ్లుపై చెత్తను నిల్వ ఉంచకుండా షాపుల నిర్వాహకులు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చెత్త పేరుకుపోవడం వల్ల నీరు నిలిచి దోమల వ్యాప్తి చెంది, విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛ బాపట్ల.. స్వచ్ఛ చీరాలలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పారు. బాపట్ల జిల్లాలో త్వరలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనున్నామని వెల్లడించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, ప్రజలు కూడా వినియోగాన్ని తగ్గించి వస్త్రాలతో తయారు చేసిన సంచులను వాడాలని ఆయన సూచించారు. చీరాల మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, వినియోగిస్తే జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ, మున్సిపల్ చైర్మన్ ఎం. సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
బాపట్ల: జిల్లాలోని రైతులందరికీ వారి అవసరాల మేరకు యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ చేస్తున్నారని కలెక్టర్ వి.వినోద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని 26 రైతు భరోసా కేంద్రాలు, పరపతి సంఘాల ద్వారా 318 మెట్రిక్ టన్నుల యూరియాను 3,452 మంది రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా 112 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని కలెక్టర్ తెలిపారు.