
మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి
చినగంజాం: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వంద మంది తెలుగు మహనీయుల విగ్రహాలతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహా నిర్మాణం చేయాలని ఊరూర జన విజ్ఞానం రాష్ట్ర అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నవ్యాంధ్ర రాష్ట్ర సాంస్కృతిక చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా కడవకుదురులో నవ్యాంధ్ర సాంస్కృతిక కళాయాత్ర నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు విజ్ఞప్తులపై స్థానిక ప్రజా చైతన్య కళావేదిక సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి ఇనేళ్లయినా సరైన అభివృద్ధి జరగలేదన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఆహ్వాన కమిటీలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే ఐదు విజ్ఞప్తులపై కార్యక్రమంలో వివరించారు. ఆరిగ వెంకట్రావు, కాళిదాస్, పల్లపోలు నాగమనోహర లోహియా, సుంకర కోటేశ్వరరావు, వారు ముసలారెడ్డి, దైవాల తిరుపతిరెడ్డి, ఎం. గోపాల్, ఏడుకొండలు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.