
ఇద్దరు విద్యార్థుల ఉసురు తీసిన కాలేజీ బస్సు
పొదిలి: దసరా పండగను స్వగ్రామంలో జరుపుకొనేందుకు బయల్దేరిన ఇద్దరు బీటెక్ విద్యార్థులను ఓ కాలేజీ బస్సు పొట్టన పెట్టుకుంది. వరుసకు అన్నదమ్ములైన వీరు బైకుపై విజయవాడ నుంచి స్వగ్రామం హనుమంతునిపాడుకు బయల్దేరారు. ఈ క్రమంలో శుక్రవారం పోతవరం వద్ద ఓ కాలేజీ బస్సు ఢీకొనటంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వివరాలు.. మచ్చా బ్రహ్మయ్య (19), బండ్లమూడి గురువిష్ణు (22) అక్కాచెల్లెళ్ల కుమారులు. విజయవాడలో బీటెక్ చదువుతున్నారు. గురువిష్ణు కుటుంబం విజయవాడలో, బ్రహ్మయ్య కుటుంబం హనుమంతునిపాడులో ఉంటోంది. దసరా పండగకు హనుమంతునిపాడులో గడిపేందుకు బైకుపై శుక్రవారం ఉదయం బయల్దేరారు. వేగంగా వస్తున్న కాలేజీ బస్సు యువకులను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడే కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మోటారు సైకిల్ దూరంగా పడి ఉంది. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న కాలేజీ బస్సును పోలీసుస్టేషన్‌కు తరలించారు.
భీతావహంగా సంఘటన స్థలం
ప్రమాద స్థలం భీతావహంగా మారింది. ఒక యువకుడి మెదడు చిదిరి రోడ్డంతా పడింది. వర్షం కురుస్తుండటంతో రక్తంతో రోడ్డంతా ఎరుపెక్కింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. శరీర భాగాలు దూరంగా ఎగిరిపడ్డాయి. బ్యాగ్‌లు, పిండి ప్యాకెట్ సంఘటన స్థలంలో పడి ఉన్నాయి. తొలుత గుర్తు తెలియని వాహనంగా అనుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఓ ప్రైవేటు కాలేజీ బస్సు సంఘటనకు కారణంగా అనుమానించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేయడంతో బస్సు వివరాలు తేలాయి. కంభాలపాడు వైపు నుంచి పిల్లలను ఎక్కించుకుని విశ్వనాథపురానికి వస్తున్న బస్సు మధ్యలో పోతవరం విద్యార్థులు చేయెత్తినా ఆపకుండా వెళ్లింది. ఈ క్రమంలో విద్యార్థులను విచారించగా... ఆ బస్సే ప్రమాదానికి కారణమని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పండగకు వస్తూ పరలోకాలకు..
మృతుల తల్లులు తిరుపతమ్మ, రమణమ్మలు అక్కాచెల్లెళ్లు. వీరిది వెలిగండ్ల మండలం పూలికుంట్ల. బ్రహ్మయ్య తల్లిదండ్రులు హనుమంతునిపాడులో నివాసం ఉంటున్నారు. ఇంటర్ వరకు కనిగిరిలో చదివిన బ్రహ్మయ్య.. బీటెక్ చదివేందుకు విజయవాడలో చేరి హాస్టల్లో ఉంటున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బండ్లమూడి రాజా, రమణమ్మల కుమారుడైన విష్ణు విజయవాడలోనే బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. సెలవులు ఇవ్వడంతో విష్ణు, బ్రహ్మయ్యలు పండగ ఆనందంగా గడిపేందుకు వస్తుండగా బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ప్రభుత్వ వైద్యశాలకు చేరిన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇద్దరు విద్యార్థుల ఉసురు తీసిన కాలేజీ బస్సు

ఇద్దరు విద్యార్థుల ఉసురు తీసిన కాలేజీ బస్సు