
డీఎస్సీ ఉపాధ్యాయులకు తప్పిన ప్రమాదం
ప్రత్తిపాడు: హైవేపై పెను ప్రమాదం తప్పింది. మార్జిన్‌లో నిలిపి ఉంచిన ఫర్నీచర్ లోడ్ ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది డీఎస్సీ ఉపాధ్యాయులకు ప్రమాదం తప్పిపోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం కొండమంచిలి గ్రామానికి చెందిన మానూరి త్రినాథ్ గత కొంతకాలంగా విజయవాడలో నివాసం ఉంటూ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 25వ తేదీ రాత్రి త్రినాథ్ తన మేనల్లుడు పొదిలి మోషేకుతో కలసి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుంచి ట్రాలీ ఆటోలో కుర్చీల లోడుతో తిరుపతికి బయల్దేరాడు. మార్గమధ్యలో అర్ధరాత్రి సమయంలో ఆటో నడుపుతున్న మహేష్ కాలకృత్యాల కోసం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సమీపంలో పదహారో నంబరు జాతీయ రహదారిపై మార్జిన్‌లో ఆటో నిలిపాడు. తర్వాత కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఇటీవల డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన సుమారు 40 మంది ఉపాధ్యాయులతో గుంటూరు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న కనిగిరి డిపో ఆర్టీసీ బస్సు వేగంగా ఆ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆటోలో ఉన్న త్రినాథ్‌తోపాటు ఆటో కూడా సైడు కాలువలోనికి దూసుకుపోయింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతినగా, త్రినాథ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న 40 మంది డీఎస్సీ ఉపాధ్యాయులకు ఎలాంటి నష్టం జరగలేదు. వీరంతా గురువారం రాజధానిలో జరిగిన సీఎం సభకు హాజరై రాత్రికి తిరుగు పయనమయ్యారు. త్రినాథ్‌ను చిలకలూరిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇచ్చిన పిర్యాదు మేరకు ప్రత్తిపాడు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎన్. నరహరి తెలిపారు.