
డిజిటల్ అరెస్ట్‌ను ఛేదించిన పోలీసులు
బాపట్ల టౌన్: డిజిటల్ అరెస్ట్ అంటూ రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడిని బెదిరించి రూ.1.10 కోట్లు కొల్లగొట్టిన కేసును బాపట్ల పోలీసులు ఛేదించారు. కర్ణాటకకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.55 లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ కేసు వివరాలను బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ శుక్రవారం వివరించారు. ఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. చీరాల పట్టణానికి చెందిన విశ్రాంత వైద్యుడికి ఈ నెల 9న తొలుత ట్రాయ్ (టెలికమ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి మాట్లాడుతున్నామని అంటూ కాల్ వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం ఇన్‌కంట్యాక్స్ విభాగం నుంచి మాట్లాడుతున్నామని అంటూ మరో కాల్ వచ్చింది. ఈ నెల 10న మీపై ట్రాయ్, ఇన్‌కంట్యాక్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా దర్యాప్తు చేస్తున్నాం.. సీబీఐ అధికారులమంటూ యూనిఫాంలో ఉన్న నకిలీ పోలీసులు వీడియో కాల్ చేశారు. ఈ కేసులో భాగంగా మీ ఇంట్లో సోదాలు నిర్వహించాలంటూ బెదిరించారు. అలా జరగకుండా ఉండాలంటే ముందు రూ.1.10 కోట్లు చెల్లించాలని, దర్యాప్తులో నిర్దోషి అయితే డబ్బు బ్యాంకు ఖాతాకు వాపసు చేస్తామని చెప్పారు. ఇది నిజమని నమ్మిన ఆయన ఈనెల 11న వారు పంపించిన ఎస్ బ్యాంక్ అకౌంట్‌కు రూ.50 లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్‌కు రూ.50 లక్షలు జమ చేశారు. ఈ నెల 17న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్‌కు మరో రూ.10 లక్షలు జమ చేశారు. తరువాత వారి నుంచి ఫోన్ రాకపోవడంతో అనుమానించిన ఆయన ఈ నెల 19న చీరాల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇది కర్ణాటకకు చెందిన వ్యక్తుల మోసమని గుర్తించారు. చీరాల వన్‌టౌన్ సీఐ, జిల్లా ఐటీ కోర్ సిబ్బంది కొందరు కర్ణాటక వెళ్లి ఇద్దరిని అరెస్టు చేసి తీసుకొచ్చి శుక్రవారం బాపట్ల కోర్టులో హాజరుపరిచారు. విచారణలో తమతోపాటు తమిళనాడు, ఇతర దేశాలకు చెందినవారు ఈ ముఠాలో ఉన్నట్లు నిందితులు తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి రూ.2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లోని ఖాతాల్లో ఉన్న రూ.55 లక్షల్ని ఫ్రీజ్ చేయించారు. కేసును త్వరితగతిన ఛేదించిన చీరాల వన్‌టౌన్ సీఐ, చీరాల డీఎస్పీ, జిల్లా ఐటీ కోర్ బృందాన్ని ఎస్పీ అభినందించారు.