
బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి
పట్నంబజారు: అసెంబ్లీ సాక్షిగా నటుడు చిరంజీవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డిలపై ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కనీస విజ్ఞత లేకుండా సభా మర్యాద తెలియని బాలకృష్ణ తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మద్యాన్ని తాగి వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందని విమర్శించారు. మాజీ సీఎం వై.ఎస్.జగన్ ద్వారా ఎంతో లబ్ధి పొందిన విషయాన్ని గుర్తించాలన్నారు. బసవతారకం హాస్పిటల్‌కు సంబంధించి పెండింగ్ బిల్లులను టీడీపీ హయాంలో ఇవ్వకపోతే, స్వయంగా వై.ఎస్.జగన్ వాటిని విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వెంటనే రాజకీయం చేయకుండా బాలకృష్ణ జీవితాన్ని కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు. తండ్రిపై చెప్పులు వేయించిన వ్యక్తితో పయనిస్తున్న బాలకృష్ణకు, తండ్రి ఆశయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వై.ఎస్.జగన్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ సినిమా వాళ్లను అవమానించారంటూ పిచ్చిబట్టిన వ్యాఖ్యలు చేస్తూ వై.ఎస్.జగన్‌పై కూటమి నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రజా సమస్యలు చర్చించిన పాపాన పోలేదని మండిపడ్డారు. సినిమా డైలాగులు చెప్పడం తప్ప, కనీసం మాట్లాడలేని బాలకృష్ణ ఒక సైకో అని మండి పడ్డారు సమావేశంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేతలు వేలూరి అనిల్‌రెడ్డి, కానూరి శశిధర్, వెంకటేష్‌రెడ్డి, దానం వినోద్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం
గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి