
ప్రజలకు కట్టుదిట్ట రక్షణ
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అరవింద వారధి వద్ద వరద ప్రవాహం పరిశీలన
కొల్లూరు: కృష్ణా నదికి వరద తాకిడి అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలను ఆపద నుంచి రక్షించడానికి కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. మండలంలోని పెసర్లంక అరవిందవారధి వద్ద నదిలో బుధవారం వరద ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద సమయంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ముంపు ప్రాంత ప్రజల్ని కాపాడటానికి పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉందని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరిస్తూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రవాహంలోకి పిల్లలను వెళ్లనివ్వ వద్దని తెలిపారు. వరద ముంపు గ్రామాల ప్రజలు ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. వరద నీరు చేరిన రోడ్లపై రాకపోకలు సాగించ వద్దని, నీటిలో మునిగిన ప్రాంతాల్లో ప్రజల్ని నియంత్రించేందుకు పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆపదలో ఉంటే తక్షణం కంట్రోల్ రూమ్‌లకు, డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. ఆయన వెంట రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు, వేమూరు సీఐ పి.వి. ఆంజనేయులు, ఎస్‌బీ సీఐ జి. నారాయణ పాల్గొన్నారు.