
‘బీచ్ ఫెస్టివల్’పై ముమ్మర ప్రచారం
బాపట్ల: బీచ్ ఫెస్టివల్‌కు ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా ప్రచార ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టరు వి.వినోద్ కుమార్ ఆదివారం పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26 నుంచి 28 వ తేదీ వరకు సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాలలో, ఇతర ప్రచార విధానాల గురించి ఆరా తీశారు. బాపట్ల జిల్లాలోని కాజు ప్రాసెసింగ్, ఆక్వా ఉత్పత్తులు, చీరాల చేనేత వస్త్ర తయారీ గురించి ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని చెప్పారు. బీచ్ అందాలను, ఫెస్టివల్‌లో నిర్వహించే కార్యక్రమాల గురించి నిమిషం నిడివి కలిగిన వీడియోలు రూపొందించాలని సూచించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ ప్రాంతాలు, ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రచార స్టిక్కర్లను అతికించాలని తెలిపారు. ప్రచార కరపత్రాలను ముద్రించాలన్నారు. ఏర్పాట్లపై టూరిజం శాఖ సాంకేతిక అధికారులను అడిగి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ప్రముఖులకు, అధికారులకు, మీడియా వారికి పాసులు అందజేయాలన్నారు. హరిత రిసార్టును సుందరంగా తీర్చిదిద్దాలని మేనేజరును ఆదేశించారు. కార్యక్రమంలో టూరిజం అధికారి పద్మారాణి, ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎస్‌ఈ ఈశ్వరయ్య, డీఈలు, ఏఈలు, ఏపీ టూరిజం అథారిటీ బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పనులు త్వరగా పూర్తి చేయండి
సూర్యలంక బీచ్ ఫెస్టివల్ నిర్వహణ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఇన్‌చార్జి జేసీ గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ఫెస్టివల్ నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులతో కలిసి ఆదివారం ఉదయం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ.. కేటాయించిన పనులను దగ్గర ఉండి సంబంధిత అధికారులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డీపీఓ ప్రభాకరరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, బాపట్ల, చీరాల ఆర్డీఓలు పి.గ్లోరియా, చంద్రశేఖర్ నాయుడు, డీఆర్‌డీఏ ఇన్ చార్జి పీడీ లవన్న, వివిధ శాఖల అధికారులు, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం

‘బీచ్ ఫెస్టివల్’పై ముమ్మర ప్రచారం