
ఎస్సీ కాలనీలో పంచాయతీ రహదారి మూసివేత
చెరుకుపల్లి: అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి వందలాది మంది రాకపోకలు సాగించే పంచాయతీ రహదారిని ఆక్రమించి ఎస్సీ కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటన మండలంలోని కావూరులో జరిగింది. నివాసితుల వివరాల మేరకు.. ఎస్సీ కాలనీ నుంచి గ్రామంలోకి వెళ్లేందుకు 50 సంవత్సరాల కిందట రోడ్డు ఏర్పాటు చేశారు. అనంతరం కాలనీ వాసుల సహకారంతో పంచాయతీకి రాశారు. విద్యుత్ స్తంభాలు, మంచినీటి కుళాయిలు కూడా పంచాయతీ అనుమతితోనే ఏర్పాటు చేశారు. ఇన్ని సౌకర్యాలతో రాకపోకలు సాగిస్తున్న ఈ రోడ్డును అదే గ్రామం కూటమి ప్రభుత్వానికి చెందిన కొల్లు సుధీర్ సిమెంటు తూములు, ఇనుప కంచె వేసి మూసి వేశాడని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సబ్‌ప్లాన్ ప్రత్యేక గ్రాంటుతో రోడ్డు నిర్మాణం
మాజీ సర్పంచ్ నన్నపనేని వెంకటరావు మాట్లాడుతూ తాను గ్రామ సర్పంచ్‌గా ఉన్నప్పుడు సమయంలో 2010–11లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రత్యేక గ్రాంటు ద్వారా కొంత దూరం సీసీ రోడ్డును నిర్మించినట్లు తెలిపారు. ఈ రోడ్డులో నూతన భవనాలు నిర్మించుకునే వారికి, నీటి కుళాయిలు, విద్యుత్ మీటర్లకు పంచాయతీ ద్వారానే ఇప్పటి వరకు అనుమతులు కొనసాగుతున్నాయని తెలిపారు.
పట్టించుకోని అధికారులు
దౌర్జన్యంగా రోడ్డు ఆక్రమించిన వ్యక్తిపై పంచాయతీ అధికారులకు, స్థానిక పోలీసులు, రెవెన్యూ వారికి పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఎస్సీ కాలనీవాసులు వాపోతున్నారు. వందలాది మంది నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తూ, పంచాయతీకి అన్ని పన్నులు చెల్లిస్తున్నా రోడ్డుకు సంబంధించి అసలు రికార్డే లేకపోవడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కుట్రే అని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా వేసిన సిమెంటు తూములు తొలగించి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. రోడ్డు సమస్యపై పంచాయతీ కార్యదర్శి ఎం. డోగేంద్ర కుమార్‌ను వివరణ కోరగా గ్రామానికి చెందిన కొల్లు సుధీర్ కోర్టును ఆశ్రయించాడని తెలిపాడు. ఈ రోడ్డుకు సంబంధించి అసలు ఏ రికారుర్డు పంచాయతీలో లేదని వివరణ ఇచ్చారు.
నివాసితులను భయభ్రాంతులకు గురి చేస్తున్న గ్రామానికి చెందిన వ్యక్తి