
అనుయాయులకు కట్టబెట్టేందుకే మెడికల్ ప్రైవేటు పరం
విద్య, వైద్యం పేదలకు అందకుండా చేసేందుకు కుట్ర పీపీపీ విధానాన్ని అడ్డుకునేందుకు న్యాయపోరాటానికై నా సిద్ధం మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను చంద్రబాబునాయుడు తన అనుయాయులకు కట్టబెట్టేందుకే పీపీపీ విధానానికి కేబినెట్‌లో అనుమతి తీసుకున్నారని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. దాతల సహకారంతో సేకరించిన స్థలంలో ఇప్పటికే రూ.82 కోట్లు ఖర్చు పెట్టిన బాపట్ల మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో కేటాయిస్తామంటే చూస్తూ ఊరుకునేదిలేదని, అవసరమైతే అందరిన్ని కూడగట్టుకుని పార్టీలకతీతంతంగా న్యాయపోరాటానికై నా సిద్ధమని అన్నారు. తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కోన మాట్లాడారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం మొదటి నుంచి విద్య, వైద్యాన్ని పేదవాడికి అందకుండా చేయాలనే కుట్రతోనే ముందుకుపోతుందని అన్నారు. 40 సంవత్సరాలు ఇండ్రస్టీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు 17 కళాశాలలను ప్రభుత్వ నిర్వహణలో నిర్వహించలేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించేందుకు నిర్ణయం తీసుకోవటం బాధాకరమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని మొదటి నుంచి చెప్పటమే కాకుండా చేసి చూపించారని పేర్కొన్నారు. 17 మెడికల్ కళాశాలకు రూ.8వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధంగా ఉండటంతోపాటు 4,5 కళాశాల్లో ఈపాటికే అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. పేదవాడికి నేరుగా వైద్యం అందించేందుకు మెడికల్ కళాశాలలు ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. మెడికల్ కళాశాలల విషయంలో 16నెలలపాటు మౌనంగా ఉన్న చంద్రబాబునాయుడు ఒక్కసారిగా పీపీపీ విధానంతో ముందుకు రావటం చూస్తుంటే ఈ 16 నెలలు తనకు సంబంధించిన వ్యక్తులు, వారితో బేరాలు కుదుర్చుకునేందుకే కాలయాపన చేశారని అన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, మచ్చా శ్రీనివాసరెడ్డి, తన్నీరు అంకమ్మరావు, జోగి రాజా, అడే చందు, ఎన్.శ్రీహరిప్రసాద్, పెద్దపులుగువారిపాలెం శ్రీనివాసరావు, నక్కా వీరారెడ్డి, రెడ్డా రెంకయ్య, అడ్వకేట్ రవి తదితరులు పాల్గొన్నారు.