
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
మార్టూరు: అటవీ ప్రాంతంలోని వన్య ప్రాణులను ఎవరైనా వేటాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని కూకట్లపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ బాబు హెచ్చరించారు. మండలంలోని బబ్బేపల్లి, రాజుగారి పాలెం గ్రామాల పరిధిలోని స్థానికులతో ఆయన శనివారం మాట్లాడారు. ఈ రెండు గ్రామాల పరిధిలో వ్యాపించి ఉన్న కొండ అటవీ శాఖ ఆధీనంలో ఉన్నందున భూభాగంలో సంచరించే వన్య ప్రాణులను అభివృద్ధి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు గ్రామాల మధ్య అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీ ప్రారంభించామని అందులో టేకు, వేప, జామ, మద్ది, వెదురు తదితర 15 రకాల మొక్కలను ఈ సంవత్సరం పెంచుతున్నామని త్వరలో రైతులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మొక్కలను కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాటడం ద్వారా అడవిని అభివృద్ధి చేసి పర్యావరణానికి తోడ్పడడంతో పాటు వన్యప్రాణులను అభివృద్ధి చేయటం తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. అటవీ భూభాగంలో అడవి పందులను, కుందేళ్ళను, లేళ్ళు, జింకలు, ఇతర పక్షులను వేటాడటం నిషేధమని నిబంధనలు అతిక్రమించిన వారిపై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కొండ భూభాగం గతంలో రెవెన్యూ పరిధిలో ఉన్నదన్న అపోహతో కొందరు ఇష్టా రాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు నిర్వహించారని ప్రస్తుతం అటవీ శాఖ ఆధీనంలో ఉన్న ఈ భూమిలో అలాంటి అరాచక చర్యలు పూర్తిగా నిషేధమని తెలిపారు. అటవీ భూమిని ఎవరైనా ఆక్రమించినా, నకిలీ పట్టాలు, ధ్రువపత్రాలు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన రెండు గ్రామాల పరిధిలోని వన్యప్రాణులను వేటాడే సంచార తెగలకు చెందిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అవగాహన కల్పించారు.