
యూరియా కోసం అగచాట్లు
వ్యవసాయ శాఖాధికారులు, పీఏసీఎస్ సిబ్బందిపై రైతుల ఆగ్రహం పీఏసీఎస్‌లో అధికారుల సమక్షంలోనే అధిక ధర వసూలు
కొల్లూరు: రాష్ట్రంలో యూరియాకు కొరత లేదు..రైతులు అధైర్య పడవద్దంటూ ప్రభుత్వం చెబుతున్నా మరోపక్క యూరియా కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. శనివారం మండలంలోని ఆవులవారిపాలెంలో ఉన్న గాజుల్లంక పీఏసీఎస్‌కు 19.80 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. యూరియాను దక్కించుకునేందుకు రైతులు ఎగబడ్డారు. పీఏసీఎస్‌కు యూరియా వచ్చిన ప్రతిసారీ వచ్చి ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడమే మినహా తమ వంతు వచ్చే సరికి యూరియా దక్కడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోని నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి రైతులకు ఇవ్వాల్చిన యూరియాను చాటుమాటుగా నాయకులకు, వారు సిఫార్సు చేసిన వారికి తరలించడం ఎంతవరకు సబబు అని వ్యవసాయశాఖ ఏఓ నరేంద్రబాబు, పీఏసీఎస్ సిబ్బందిని నిలదీశారు. చివరకు వ్యవసాయ శాఖాధికారులు, పీఏసీఎస్ సిబ్బంది పోలీసు సిబ్బంది సాయం కోరి అన్నదాతలను కట్టడి చేయించారు.
అమర్తలూరు(వేమూరు): అమర్తలూరు మండలం మోపర్రు గ్రామంలోని రైతు సేవా కేంద్రం దగ్గర రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. నాట్లు వేసి నెల రోజులు గడిచింది, యూరియా లేకపోవడంతో వరి పైరు పెరుగుదల నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద రైతులు ఇళ్లలో వందల బస్తాలు యూరియా నిల్వ చేసుకోవడం వల్ల కొరత ఏర్పడిందని ఆరోపించారు. ప్రభుత్వం రైతులు, కౌలు రైతులకు యూరియా సకాలంగా అందించాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాయడం వల్ల ఈ సమస్య ఏర్పడిదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకొని అందరికి యూరియా అందించాలని రైతులు కోరారు.
అదనపు వసూళ్లు
యూరియా ప్రభుత్వ నిర్ణీత ధర రూ.266.50 కాగా గాజుల్లంక పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ సమయంలో రైతుల నుంచి అదనంగా రూ.33.50 వసూలు చేశారు. దీనిపై పలువురు రైతులు, కౌలు రైతు సంఘం నాయకులు అధికారులను నిలదీశారు.

యూరియా కోసం అగచాట్లు

యూరియా కోసం అగచాట్లు

యూరియా కోసం అగచాట్లు