
వైభవంగా నవ వినాయకుల నిమజ్జనం
అమరావతి: గుంటూరు, పల్నాడు జిల్లాల సత్యసాయి సేవా సమితుల ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన తొమ్మిది వినాయక విగ్రహాలను శనివారం ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిలో వైభవంగా నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజులుగా గణపతి నవరాత్రోత్సవాలను తొమ్మిది చోట్ల నిర్వహించుకుని అమరావతి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ఇలా ప్రతి ఏటా నిర్వహిస్తామని అమరావతి సత్యసాయి సేవా సమితి కో–ఆర్డినేటర్ సీహెచ్ జాజిబాబు తెలిపా రు. గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ ప్రాంగణంలోని సత్యసాయి శాంతిసుధ , గుంటూరు బైపాస్ రోడ్డులోని ఆధ్యాత్మిక సామ్రాజ్యం నుంచి దుగ్గిరాల, తెనాలి, మోదుకూరు, పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట, అచ్చంపేట, అమరావతి సాయిబాబా మందిరంలో, త్రిశక్తిపీఠంలో తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న తొమ్మిది ప్రాంతాలలోని తొమ్మిది విగ్రహాలను తొలుత వైభవంగా ఊరేగించి కృష్ణానదిలో నిమజ్జనం చేశారు.