
రైతు పక్షాన నిలబడితే కేసులు పెడతారా?
రేపల్లె: రైతు సమస్యలను రాజకీయం చేయడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వరికూటి అశోక్‌బాబును సోమవారం ఆయన పరామర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాల వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయమైన సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న అశోక్ బాబును అక్రమంగా అరెస్టు చేసి పిడిగుద్దులతో దాడి చేశారన్నారు. కాలువలు పుడికలు తీయించలేని దిక్కుమాలిన స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ క్యాడర్‌పై పట్టణ సీఐ మల్లికార్జునరావు తీరు వివాదాస్పదంగా ఉందని, భవిష్యత్‌లో ఆయన తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రజలపై అధికారులు, కూటమి నేతలు చేస్తున్న ఆగడాలను నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామన్నారు. మంత్రి అనగాని అండదండలతో పోలీసు అధికారులు బ్రోకర్ పనులు చేస్తున్నారని విమర్శించారు. అశోక్‌బాబు ఆరోగ్యం క్షీణించిందని, పోలీస్ కస్టడీలో అశోక్‌బాబు ఉన్నాడంటూ వైద్యశాల సిబ్బంది డిశ్చార్జి చేయడం లేదన్నారు. అశోక్‌బాబును వేరే ఆసుపత్రికి తీసుకెళితే తమ కస్టడీ నుంచి పరారయ్యాడని మరో అక్రమ కేసు బనాయించే కుట్రలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి హామీనివ్వటంతో పాటు అశోక్‌బాబుతో దీక్ష విరమింపజేయాలని డిమాండ్ చేశారు.
అధికారుల ఆడగాలను ప్రత్యేక యాప్‌లలో నమోదు చేస్తున్నాం వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి