కూటమి నేతలకు పొగాకు సెగ | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతలకు పొగాకు సెగ

Aug 7 2025 7:18 AM | Updated on Aug 7 2025 7:44 AM

కూటమి నేతలకు పొగాకు సెగ

కూటమి నేతలకు పొగాకు సెగ

రైతుల వద్ద ఉన్న బ్లాక్‌బర్లీ పొగాకు మొత్తం కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం మొక్కుబడిగా వ్యవహరిస్తోంది. తూతూమంత్రంగా కొని చేతులు దులుపుకొంది. రైతులు తెచ్చిన పొగాకును నాణ్యతాలోపం సాకుగా చూపి మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల నుంచి వెనక్కు పంపుతోంది. పాలకులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కూటమి పార్టీల నేతల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నామమాత్రపు కొనుగోళ్లతో మాయ చేస్తున్నారని రైతుల ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, బాపట్ల: పొగాకు రైతుల నుంచి కూటమి నాయకులకు నిరసన సెగ తప్పడం లేదు. బుధవారం బాపట్లకు వచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌ బాపట్లలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. బీజేపీ అధ్యక్షుడిని చూసిన రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం సక్రమంగా పొగాకు కొనడం లేదని, నాణ్యతాలోపం సాకుగా చూపి చెక్కులు తిప్పి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో రైతు తెచ్చిన పొగాకులో మూడవ వంతు కూడా కొనడం లేదని ఆరోపించారు. పండించిన మొత్తం కొంటామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడి ముందే నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రోడ్డెక్కి ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. అటు కంపెనీలు కొనక, ఇటు ప్రభుత్వం తీసుకోక పంట ఎలా అమ్ముకోవాలని బీజేపీ అధ్యక్షుడిని నిలదీశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి అక్కడి నుంచి మాధవ్‌ జారుకున్నారు.

మొక్కుబడిగా కొనుగోళ్లు

రైతులు ఎంత విస్తీర్ణంలో బ్లాక్‌ బర్లీ పొగాకును సాగుచేసినా కొంటామన్న కంపెనీలు డిమాండ్‌ లేదన్న సాకు చూపి మోసం చేశాయి. దీంతో మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొంటామని ప్రభుత్వం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. తర్వాత జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతుల వద్ద 80 వేల టన్నులకు పైగా బ్లాక్‌బర్లీ పొగాకు ఉండగా... 14 వేల టన్నులు మాత్రమే కొంటామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా తొలుత 27 కేంద్రాలు పెట్టిన మార్క్‌ఫెడ్‌ ఇప్పటికే 15 మూసివేసింది. కొనుగోలు కేంద్రాల పరిధిలోని గోదాములు నిండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్క్‌ఫెడ్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 4,500 మంది రైతులకు చెందిన 7 వేల టన్నుల పొగాకు కొన్నట్లు తెలిపారు. లక్ష్యం మేరకు మరో 7 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేయనున్నారు. ఇంకా రైతుల వద్ద 40 వేల టన్నులున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

వానలతో మరిన్ని కష్టాలు

ఇప్పటికే వర్షాకాలం మొదలై వానలు కురుస్తున్నాయి. చాలామంది రైతులు ఉన్న పొగాకును దాచుకునే వీలులేక పొలాల్లోనే టార్పాలిన్‌ పట్టలు కప్పి కాపాడుకుంటున్నారు. కొన్నిచోట్ల వర్షానికి చాలావరకు పొగాకు తడిసి పాడైపోయింది. నాణ్యతగా ఉంటేనే పొగాకును కొనేందుకు ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది. ఇక పాడైన పొగాకును కొనే పరిస్థితి అసలు లేదు. కూటమి సర్కారు వైఖరిపై రైతులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

రైతుల వద్ద పూర్తిగా పొగాకు కొనుగోలు చేయని కూటమి ప్రభుత్వం నాణ్యత లేదంటూ వెనక్కి తిప్పి పంపుతున్న అధికారులు బాపట్లలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర నిరసన తెలిపిన అన్నదాతలు ప్రభుత్వంతో మాట్లాడతానంటూ జారుకున్న మాధవ్‌ ఇప్పటికే 15 చోట్ల కొనుగోలు కేంద్రాలు మూసివేత మార్క్‌ఫెడ్‌ ఇప్పటివరకు కొన్నది కేవలం 7 వేల టన్నులే ఇంకా రైతుల వద్దే 40 వేల టన్నుల పొగాకు నిల్వలు నమ్మించి నట్టేట ముంచుతున్న సీఎం చంద్రబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement