
కూటమికి బీసీలు అంటే అంత అలుసా?
పెదకాకాని: కూటమి ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్‌యాదవ్ అన్నారు. పెదకాకానిలోని రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి నివాసంలో బుధవారం మండల ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు అక్రమ అరెస్టుపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్‌యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీసీలే పార్టీకి వెన్నుముక అని ప్రచారం చేసే కూటమి ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందన్నారు. మూడు సంవత్సరాల కిందట జరిగిన జలకళ పథకంలో అక్రమాలు జరిగాయని ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావుకు గిట్టని వారితో ఫిర్యాదు చేయించి అరెస్టు చేయించడం ముమ్మాటికీ రాజకీయకక్షే అన్నారు. ఈనెల 3వ తేదీన ఓ దినపత్రికలో సీనియర్ ఎమ్మెల్యేపై ఆ ఎమ్మెల్యే దందాలతో దడ అని ప్రచురణ కావడంతో సీనియర్ ఎమ్మెల్యే ఎవరబ్బా అని రాజకీయ విశ్లేషకులు, ప్రజలు సందిగ్ధంలో ఉన్నారన్నారు. అదే సమయంలో ఆ ఎమ్మెల్యే ఎవరో ఆ పార్టీ నాయకులే విలేకరుల సమావేశం పెట్టడం, అదే పత్రికతో పాటు పలు పేపర్లలో ఈనెల 5వ తేదిన తక్కెళ్ళపాడు కల్యాణ మండపం వ్యవహారంలో ఎమ్మెల్యే నరేంద్ర తప్పేంలేదని ప్రచురించడం చూస్తే ఆ సీనియర్ ఎమ్మెల్యే ఎవరో సమాజానికి స్పష్టంగా తెలియజేశారన్నారు. ఈ వ్యవహారంపై ప్రజల ఆలోచన, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చను ప్రక్కదారి పట్టించడానికే కూటమి ప్రభుత్వం ఎంపీపీని ఒక పథకం ప్రకారం అరెస్టు చేయించిందన్నారు. గతంలో అనుమర్లపూడిలో జరిగిన సంఘటన రోజు నుంచి ఎంపీపీపై ఎమ్మెల్యే కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. కేవలం రాజకీయకక్షతోనే ఎంపీపీని అక్రమంగా అరెస్టు చేయించారన్నారు. ఇటీవల కాలంలో పొన్నూరు రూరల్ మండలం, మన్నవ గ్రామ సర్పంచి బొనిగల నాగమల్లేశ్వరరావును కూడా రాజకీయ కక్షతో హత మార్చేందుకు ఎమ్మెల్యే అండదండలతో హత్యాయత్నం చేశారన్నారు. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వైఎస్సార్ సీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసిలను భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లయదుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
బీసీ, ఎస్సీ, ఎస్టీలను భయభ్రాంతులకు గురి చేయడానికే హత్యాయత్నాలు, అక్రమ అరెస్టులు
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్