
ప్రేమానురాగాలకు ప్రతీక
● నేడు రాఖీ పౌర్ణమి ● మార్కెట్‌లో పలు రకాల రాఖీలు
బాపట్లఅర్బన్: ఏటా శ్రావణ పౌర్ణమి వచ్చిందంటే సోదర సోదరీమణుల మధ్య ఆనందోత్సహాలు నెలకొంటాయి. అన్నాచెల్లెలు... అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ రానే వచ్చింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో సందడి నెలకొంది. మార్కెట్లో వివిధ రకాల రాఖీల విక్రయానికి కొలువుదీరాయి. వెలకట్టలేని బంధాలను గుర్తుచేసే మధుర బంధమే రక్షాబంధన్. తనకు రక్షణగా ఉండాలని ఉద్దేశంతో సోదరులకు శ్రావణ పౌర్ణమి రోజున సోదరి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. అన్నదమ్ముల యశస్సు, శ్రేయస్సు కోరి రాఖీ కట్టే సంప్రదాయం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. కొన్ని పాఠశాలలు, కళాశాలలో ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఆడపడుచులను తమ ఇంటి మహాలక్ష్మిగా, పరాశక్తి ప్రతీకగా భావించే గొప్ప సంస్కృతి మనది.
మార్కెట్లలో సందడి
రక్షాబంధన్ వేడుకలకు అందరూ సిద్ధమయ్యారు. రాఖీలు వివిధ ఆకృతులలో దర్శనమిస్తున్నాయి. విరివిరిగా విక్రయ స్టాల్స్ వెలిశాయి. మార్కెట్లు కళకళలాడాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి స్థానిక వ్యాపారులు వివిధ రకాల రాఖీలు తెచ్చారు. రంగు పూసలతో కూడిన చేనేత కళాకారులు రూపొందించిన రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. జ్యువెలరీ షాపుల్లో వెండి, బంగారు రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే గిఫ్ట్ షాపులు, స్వీట్ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.

ప్రేమానురాగాలకు ప్రతీక