రికవరీలో కోత! | - | Sakshi
Sakshi News home page

రికవరీలో కోత!

Aug 9 2025 5:08 AM | Updated on Aug 9 2025 5:08 AM

రికవరీలో కోత!

రికవరీలో కోత!

‘ఉపాధి’లో మేత..
● సోషల్‌ ఆడిట్‌తో వెలుగులోకి భారీగా అక్రమాలు ● చేసినట్లు చెబుతున్న పనుల్లో 50 శాతం అవినీతి ● తనిఖీల్లో వెల్లడైనా చర్యలకు డ్వామా పీడీ మీనమేషాలు ● రూ.లక్షల్లో ముడుపులు తీసుకొని నామమాత్రపు రికవరీలు ● అద్దంకి మండలంలో రూ. 8.52 కోట్ల మేరకు పనులు ● రూ. 82 లక్షలు అక్రమాలు జరిగాయని ఆడిట్‌లో వెల్లడి ● రూ.1.69 లక్షలు మాత్రమే రికవరీ చేస్తే చాలన్న పీడీ ● ‘రీ సోషల్‌ ఆడిట్‌’ డిమాండ్‌తో కమిషనరేట్‌కు ఫిర్యాదులు

సాక్షి ప్రతినిధి, బాపట్ల: నకిలీ మస్టర్‌, పనులు చేయకుండా చేసినట్లు చూపడం, గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు పెట్టుకోవడం వంటి అక్రమాలతో ఉపాధి హామీలో రూ.కోట్ల ప్రజాధనాన్ని అధికారులు, సిబ్బంది దోచుకుంటున్నారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు వెలుగు చూసినా.. డ్వామా అధికారి రూ. లక్షల్లో ముడుపులు పుచ్చుకొని ప్రొసీడింగ్‌ ఆఫీసర్‌ హోదాలో రిక్టిఫికేషన్‌, రిఫర్డ్‌, డ్రాప్‌డ్‌ పేరుతో అక్రమాలను కప్పిపుచ్చుతున్నట్లు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

అద్దంకి పరిధిలో ఎక్కువ

ఉపాధి హామీ పనుల్లో అద్దంకి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మండలంలో జూన్‌లో జరిగిన సామాజిక తనిఖీల్లో ఈ విషయం తేటతెల్లమైంది. 26 గ్రామ పంచాయతీల పరిధిలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.8,52,33,219 విలువైన పనులు జరిగాయి. ఈ ఏడాది జూన్‌ 20వ తేదీన అద్దంకి ఎంపీడీవో కార్యాలయంలో వీటిపై సామాజిక తనిఖీ జరిగింది.

అడ్డగోలుగా రికవరీ తగ్గింపు

336 పనులకు సంబంధించి రూ. 82,74,327 మేర పనుల్లో తేడాలున్నాయని ఎస్‌ఆర్‌పీ, డీఆర్‌పీలతో కూడిన సామాజిక తనిఖీలో గుర్తించారు. భారీ మొత్తంలో అవినీతి జరిగిందని కమిటీ తేల్చింది. క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఏపీవో సహా అందరి సమక్షంలోనే ఈ తనిఖీలు జరుగుతాయని తెలిసిన విషయమే. కానీ 124 పనులకు సంబంధించి రూ. 29,25,256 మాత్రమే డీవియేషన్‌ ఉందని, ఆ మేరకు మాత్రమే అక్రమాలు జరిగాయని ప్రొసీడింగ్‌ అధికారి హోదాలో డ్వామా పీడీ తేల్చారు. కేవలం 82 పనులకు చెందిన రూ.1,69,106 మాత్రమే అవినీతి జరిగిందని, ఆ మేరకు డ్వామా పీడీ రికవరీ పెట్టినట్లు సమాచారం. మిగిలిన రూ. 19.34 లక్షలకు సంబంధించిన 9 పనులను రిఫర్డ్‌ కింద రాసిన పీడీ... రూ. 8,21,426 విలువైన 33 పనులను రెక్టిఫికేషన్‌కు రాశారు. మిగిలిన రూ. 53.49 లక్షలకు సంబంధించి 212 పనుల్లో ఎటువంటి అవినీతి జరగలేదని డ్రాప్‌డ్‌ రాశారు. ఈ లెక్కన వాటిల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని డ్వామా పీడీ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. సామాజిక తనిఖీలో రూ. 82.74 లక్షల అవినీతి జరిగిందని తేలితే.. డ్వామా పీడీ మాత్రం కేవలం రూ. 1.69 లక్షలు రికవరీ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకొని అక్రమాలలో కీలక పాత్ర పోషించిన ఏపీవో, సిబ్బందిని కాపాడేందుకే డ్వామా అధికారి రికవరీలు లేకుండా చేశారని డ్వామా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తూతూమంత్రంగా తనిఖీలు

జిల్లాలో అక్రమాల నేపథ్యంలో ఉపాధి హామీలో సామాజిక తనిఖీలు చేస్తున్న షాట్‌ అధికారాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. అవకతవకలు నివారించేందుకే షాట్‌ డైరెక్టరేట్‌ సామాజిక తనిఖీలు నిర్వహిస్తోంది. ఏడాదిపాటు జరిగిన ఉపాధి పనులను షాట్‌ నుంచి వచ్చే ఎస్‌ఆర్‌పీ, డీఆర్‌పీలు క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ సిబ్బంది, ఉద్యోగులతో కలిసి తనిఖీలు చేస్తారు. అక్రమాల లెక్కలు తేలుస్తారు. వాటిని రికార్డ్‌ చేసి ప్రజలు, అధికారుల సమక్షంలో జరిగే సామాజిక తనిఖీల్లో వెల్లడిస్తారు. కానీ అక్రమాలను ప్రొసీడింగ్‌ ఆఫీసర్‌ హోదాలో డ్వామా పీడీ కప్పిపుచ్చితే ఇక సామాజిక తనిఖీలకు అర్థం లేదనే స్థితి తలెత్తింది. అద్దంకి మండలంలో జరిగిన తనిఖీలు పరిశీలిస్తే అన్నీ మొక్కుబడిగా మారాయన్న విమర్శలు వచ్చాయి.

రీ ఆడిట్‌కు డిమాండ్‌

కొన్నిచోట్ల డ్వామా, తనిఖీ అధికారులు కుమ్మకై ్క అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలు జరిగాయని తేల్చినా రికవరీలు లేకపోతే ఎలా అని ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు. అధికారులపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అద్దంకి మండలంలో జరిగిన ఉపాధి హామీ అక్రమాలపై రీ సోషల్‌ ఆడిట్‌ చేయాలని మండలానికి చెందిన పలువురు నేతలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు మాజీ సర్పంచ్‌లు ఈ విషయంపై పంచాయతీ రాజ్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

కూటమి ఏడాది పాలనలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. ఎక్కడ సామాజిక తనిఖీ జరిగినా అక్రమాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు మొదలు టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఏపీవోలతోపాటు జిల్లా స్థాయిలో పీడీ వరకు అవినీతి సొమ్ములో వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సామాజిక తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూస్తున్నా రికవరీ నామమాత్రంగా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement