
మూడేళ్ల బాలిక విక్రయం
● కేసు ఛేదించిన పోలీసులు ● తండ్రితో పాటు మరో ఇద్దరు నిందితులూ అరెస్టు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తి.. భార్యకు తెలియకుండా మూడేళ్ల కుమార్తెను అపహరించారు. సహజీవనం చేస్తున్న ఓ జంటకు విక్రయించాడు. తర్వాత ఏం తెలియనట్లుగా విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు అసలు నిందితుడు తండ్రే అని పోలీసులు నిగ్గు తేల్చారు. ఈ మేరకు విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) ఇన్‌స్పెక్టర్ జె.వి.రమణ, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఫతే అలీబేగ్‌లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన సైకం మస్తాన్, వెంకటేశ్వరమ్మ భార్యాభర్తలు. వీరికి ఏడుగురు సంతానం. చెడు వ్యసనాలకు బానిసైన భర్త తరచూ భార్యతో గొడవలు పడుతుండేవాడు. కుటుంబంలో గొడవలు జరగటంతో భార్య తన పిల్లలతో కలసి, భర్తకు దూరంగా వేటపాలెంలో ఉంటోంది. ఈ నెల 6న మస్తాన్ భార్య ఇంటికి వెళ్లి తన ఏడో సంతానమైన మూడేళ్ల శ్రావణిని తీసుకుని విజయవాడలో విక్రయించాడు.
ముగ్గురు నిందితులను అరెస్టు
చేసిన జీఆర్పీ
మస్తాన్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తల్లి ఆచూకీ తెలుసుకుని ఆమెను పిలిపించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులు బాలికను తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. బస్‌స్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే బస్సు ఎక్కినట్లు గుర్తించి డ్రైవర్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి వివరాలు చెప్పడంతో బాలికను తీసుకుని ఒక మహిళ, పురుషుడు బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్నారు. రాజమండ్రి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని బాలికతోపాటు ఇద్దరు నిందితులను విజయవాడ తీసుకువచ్చారు. బాలికను తల్లికి అప్పగించారు. మస్తాన్‌తోపాటు బాలికను కొనుగోలు చేసిన నిందితులను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.