
కనులు కాయలు కాచే..!
ఆర్డీ కోసం ఎదురు చూపులు ● వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ పోస్టు ఖాళీ ● ఆర్డీని ప్రభుత్వానికి సరెండర్ చేసిన అధికారులు ● కొత్త ఆర్డీని నియమించకపోవడంతో ఇబ్బందులు ● ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైద్య ఉద్యోగుల నిరీక్షణ
గుంటూరు మెడికల్: వైద్య ఆరోగ్య శాఖలో మూడు జిల్లాల ఉద్యోగులకు కీలకమైన అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో ఫోకల్ జోన్‌గా ఉన్న గుంటూరు కార్యాలయం చుట్టూ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు, సెలవులు మంజూరు, ఇతర ఉద్యోగ కార్యకలాపాల బాధ్యతలన్నీ గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) పర్యవేక్షిస్తారు. ఆర్డీ సంతకం లేకుండా ఉమ్మడి మూడు జిల్లాల ఉద్యోగుల ఫైల్స్ ఒక అంగుళం కూడా ముందుకు వెళ్లవు. అలాంటి కీలక రీజనల్ డైరెక్టర్‌ను గతనెల ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆ స్థానంలో నూతనంగా ఎవరిని నియమించలేదు. కనీసం ఇన్‌చార్జి బాధ్యతలు కూడా అప్పగించలేదు. దీంతో ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారనే విషయం తెలియక మూడు జిల్లాలకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంత మంది ప్రమోషన్లు, మరికొంత మంది సెలవు మంజూరు జాప్యం అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తరచుగా సెలవులు... ఫైల్స్ పెండింగ్
గుంటూరు ఆర్డీగా డాక్టర్ కె.సుచిత్ర గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి అనారోగ్య కారణంతో తరచూ సెలవులు పెట్టేవారు. నెలల తరబడి సెలవులు పెట్టడం, ఒక్కోసారి కార్యాలయానికి వచ్చినప్పటికీ అనారోగ్య కారణంతో ఫైల్స్‌పై సంతకాలు పెట్టకుండా కూర్చుండిపోవడం వల్ల మూడు జిల్లాలకు చెందిన ఉద్యోగులు తమ ఫైల్స్ పెండింగ్ ఉంటున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ఫైల్స్‌కు సంబంధించి కూడా సంతకాలు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్డీ కార్యాలయం ఉద్యోగులు, అధికారులు, అందరూ మూకుమ్మడిగా రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆర్డీని మార్చాలని లిఖిత పూర్వకంగా కోరారు. తరచూ తమపై దాడి చేసిందంటూ ఉద్యోగులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆర్డీ కూడా తనకు కార్యాలయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ఉద్యోగులు తనపై దాడి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. గత నెలలో రెండు వారాల పాటు సెలవు పెట్టిన ఆర్డీని రాష్ట్ర ఉన్నతాధికారులు సరెండర్ చేశారు. దీంతో ఈ నెల 1 నుంచి ఆర్డీ కార్యాలయంలో ఫైల్స్‌పై సంతకాల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.
2,500 మందికి పైగా ఉద్యోగులు
ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆర్డీ కార్యాలయం పరిధిలో 2,500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. స్టాఫ్ నర్సులు, హెడ్‌నర్సులు, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌లు, మల్టీపర్పస్ హెల్త్ సూపర్‌వైజర్లు, ఎంపీహెచ్‌ఈఓలు, సీహెచ్‌ఓలు, రేడియోగ్రాఫర్లు, ఫార్మాశిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సూపరింటెండెంట్‌లు, ఇలా పలు కేడర్లకు చెందిన పారా మెడికల్, మినిస్టీరియల్ ఉద్యోగులు ఆర్డీ కార్యాలయం పరిధిలో ఉన్నారు. వీరిలో 25 కేడర్లకు చెందిన ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. పలువురు ఉద్యోగులకు వ్యక్తిగత, మెడికల్ సెలవులు, ఇంక్రిమెంట్లు, ఇతర అలవెన్సులకు సంబంధించిన ఫైల్స్ వందకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు ఫైల్స్‌ది అదే పరిస్థితి.
ఇన్‌చార్జి నియామకంపై జాప్యం
గతంలో రెగ్యులర్ ఆర్డీ దీర్ఘకాలిక సెలవులో వెళ్లినా, పదవీ విరమణ చేసినా, బదిలీ అయినా, మరో రెగ్యులర్ ఆర్డీ విధుల్లో చేరే వరకు తాత్కాలికంగా వేరొకరిని నియమించేవారు,. తాత్కాలిక, ఆర్డీని ఎఫ్‌ఏసీ హోదాలో నియమించేందుకు ఏమైనా ఆటంకాలు ఏర్పడితే ఆర్డీ పోస్టు ఖాళీగా ఉండకుండా, కనీసం గుంటూరు డీఎంహెచ్‌ఓను ఇన్‌చార్జి ఆర్డీగా నియమించి, ఆర్డీ కార్యాలయం కార్యకలాపాలు సజావుగా జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేవారు. నేడు వీటిల్లో ఏ ఒక్కటి జరగకపోవడం, కనీసం ఆర్డీ కార్యాలయానికి అధికారిని కూడా నియమించకపోవడంతో ఉద్యోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్ర ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి ఇన్‌చార్జి ఆర్డీని నియమించి ఫైల్స్ పెండింగ్ లేకుండా చూడాలని పలువురు బాధితులు కోరుతున్నారు.