
దురుద్దేశంతోనే కొన్న స్థానాలకు ఎన్నికలు
● ధైర్యముంటే రాష్ట్రంలోని అన్ని ఖాళీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలి ● పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యానికి కుట్రలు ● వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భవనం శ్రీనివాసరెడ్డి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కడప జిల్లాలోని రెండు జడ్పీటీసీలకు కూటమి ప్రభుత్వం ఎన్నికలు పెట్టిందని పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భవనం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. దురుద్దేశంతోనే ప్రత్యేకించి పులివెందులలో ఎన్నికలు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఖాళీస్థానాలకు ఎన్నికలు పెట్టి సత్తాచాటాలన్నారు. ఆ ధైర్యంలేక అధికారం అడ్డుపెట్టి కొన్నింటికి ఎన్నికలు పెట్టడం ప్రజాస్వామ్యం కాదన్నారు. ఏడాది పూర్తికాకుండానే ప్రభుత్వంపై ప్రజల్లోకి తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం అధికార పార్టీ నాయకులకు తెలుసన్నారు. కేవలం కడప జిల్లాలో రెండు ఎన్నికలు పెట్టి పోలీసులను అడ్డుపెట్టి దౌర్జన్యంతో గెలవాలని చూస్తున్నారని, అది కలలో కూడా సాధ్యం కాదన్నారు. అధికారం ఉందని టీడీపీ వారు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం తగదన్నారు. ఇప్పటికై నా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలన్నారు.