
కౌలు చెల్లు.. బతుకు ఘొల్లు!
జె.పంగులూరు: కౌలు రైతులను కష్టాలు వీడడం లేదు. సెంటు భూమి లేకపోయినా సేద్యాన్ని నమ్ముకొని పంటలను సాగుచేస్తునే ఉన్నా ఏటికేడు పెట్టుబడులు పెరుగుతూనే ఉండటంతో కౌలు రైతులు చేతులెత్తేస్తున్నారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో వేసిన మినుము, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం హడావిడిగా అధికారులతో పంట నష్ట పరిహారం అంచనా వేయించింది. నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపింది. కానీ ఇంత వరకు పంట నష్టపరిహారం అందిన దాఖలాలు లేవు. జిల్లాలో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
పడిపోయిన కౌలు సాగు
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కౌలు రైతులు పూర్తిగా తగ్గిపోయారు. గత రెండు సంవత్సరాల నుంచి పంటలు పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధర రాక, రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. దీంతో కౌలు రైతులు పంట పొలాలు కౌలుకు తీసుకునేందుకు మందుకు రావడం లేదు. ఈ ఏడాది మండలంలో ఎకరా కౌలు రూ.15 వేల నుంచి రూ. 20 వేలు పలుకుతోంది. గత సంవత్సరం ఎకరా కౌలు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు ధర పలకడం గమనార్హం. కానీ వేసిన పంట అమ్ముడుపోక కౌలు రైతులు కోలుకోలేని దెదెబ్బతిన్నారు. ప్రభుత్వాల నుంచి సాయం అందక, సాగు వ్యయంతో పాటు కౌలు ధరలు పెరగడంతో కూలీలుగా మారడమే నయం అని దుఃఖిస్తున్నారు.
ఏటా పెరుగుతున్న సాగు పెట్టుబడులు
సీసీఆర్సీ కార్డులు అందించని ప్రభుత్వం
అందని రాయితీలు, రుణాలు
సంకట స్థితిలో కౌలు రైతులు
భూ యజమానులతో తంటా
అధికారులు హడావిడి చేసి కౌలు రైతుల గుర్తింపు కార్డులు తీసుకోమని చెప్పడమే గానీ.. రైతులకు గుర్తింపు కార్డులు అందించడం లేదు. కౌలు రైతు చట్టంలో వీరికి అన్యాయం జరుగుతోంది. సీసీఆర్ కార్డులన్నా ఉంటే వీరికి కాస్త ప్రయోజనం ఉండేది.. అయితే ఈ కార్డులు ఇవ్వాలంటే భూ యజమానులు సంతకం కావాల్సి ఉండడంతో, యజమానులు అందుకు ఒప్పుకోకపోవడంతో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభుత్వం నుంచి సాయం అందక.. యజమానుల తీరుతో కార్డులు దక్కక.. ఇటు బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోవడంతో అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని కౌలు వాపోతున్నారు.