
బంగారం, వెండి ఆభరణాలు చోరీ
బల్లికురవ: ఇంటి వెనుక భాగంలో నుంచి దొంగలు ప్రవేశించి బీరువాలో ఉంచిన బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు. ఈ ఘటన మేదరమెట్ల – నార్కెట్‌పల్లి నామ్ రహదారిలోని మండలంలోని రామాంజనేయపురం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరగ్గా బుధవారం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటుపల్లి గురుమూర్తి, ఇంటికి తాళం వేసుకుని కుటుంబ సభ్యులతో వరండాలో నిద్రిస్తున్నారు. దొంగలు పథకం ప్రకారం ఇంటి లోపలికి ప్రవేశించి బీరువా తాళాలు తెరిచి 3 సవర్ల బంగారు ఆభరణాలు, 30 తులాలు వెండి ఆభరణాలు, రూ. 1500 నగదు చోరీ చేశారు. ఆభరణాల విలువ రూ. 6 లక్షల పైన ఉంటుందని బాధితుడు తెలిపాడు. బుధవారం ఉదయం నిద్రలేచిన గురుమూర్తి కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు, బీరువా తలుపులు తెరచి ఉండటం చూసి, చోరీ జరిగినట్లుగా గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంతమాగులూరు సీఐ కె.వెంకటరావు, ఎస్‌ఐ వై.నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. ప్రధాన రహదారి పక్కనే దొంగతనం జరగటంపై గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.