
ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
మేదరమెట్ల: కొరిశపాడులో రూ.1.66 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ప్రారంభించారు. స్థానిక దండు రామకృష్ణారెడ్డి హైస్కూల్‌లో గల విద్యార్థినులకు 56 సైకిళ్లను పంపిణీ చేశారు. దివ్యాంగులు 15 మందికి ట్రై స్కూటీలను ఉచితంగా అందజేశారు. గ్రామంలో సీసీ రోడ్లు.. డ్రైనేజీ, గ్రావెల్ లింక్‌రోడ్డు నిర్మాణాలకు గాను రూ.2.30 కోట్లు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వెంకటమురళి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఐపీఎస్‌కు ఎంపికై న దోనేపూడి విజయ్‌బాబు
తెనాలి: పట్టణానికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 2024 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సర్వీస్‌లను కేటాయిస్తూ యూపీఎస్‌ఈ మంగళవారం తుది ఫలితాలను విడుదల చేసింది. 2021 సివిల్స్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్‌కు ఎంపికై న విజయ్‌బాబు, ప్రస్తుతం విజయవాడలో ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్ (ఇన్వెస్టిగేషన్స్) బాధ్యతల్లో ఉన్నారు. ఐఏఎస్‌కు ఎంపిక కావాలన్న లక్ష్యం కోసం వరుసగా సివిల్స్ పరీక్షలురాస్తూ వచ్చారు. నాలుగో పర్యాయం 681 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయినప్పటికీ తనకు సంతృప్తి లేదన్నారు. విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి అయిన తన తండ్రి దోనేపూడి మధుబాబు కోరిక ప్రకారం ఐఏఎస్ అధికారి కావాలన్నదే తన కలగా విజయ్‌బాబు చెప్పారు. అందుకోసం మరోసారి సివిల్స్ రాస్తానని తెలిపారు.
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
మంగళగిరి/ మంగళగిరి టౌన్: ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఆటోనగర్‌లో ఉన్న వీవర్స్‌శాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ,ఎమ్మెల్సీ పెందుర్తి వెంకటేశ్వరరావు, సబ్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, మంగళగిరి తహసీల్దార్ దినేష్‌రాఘవేంద్రలు ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం ప్రయాణించే మార్గాలు, వాహనాల పార్కింగ్, వీవర్ శాల సందర్శన, చేనేత కుటుంబాలతో సమావేశమయ్యే ప్రజావేదిక వద్ద అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
13 నుంచి అమరేశ్వరుని పవిత్రోత్సవాలు
అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో 13వ తేదీ బుధవారం నుంచి పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తామని ఆలయ ఈఓ రేఖ మంగళవారం తెలిపారు. యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మి దంపతుల నేతృత్వంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. మొదటి రోజు వేదపండితులచే ఉదక శాంతి, ఆలయ శుద్ధి, ప్రధాన ఉపాలయాల మూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారన్నారు. రెండోరోజు గురువారం మండప పూజలు, దీక్షా హోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చంఢీహోమం మూడవరోజు శుక్రవారం ప్రాయశ్చిత్త హోమం, పూర్ణాహూతి, మహదాశీర్వచనం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి