
చంద్రబాబు ప్రభుత్వానికి స్మార్ట్ మీటర్ల గండం
అద్దంకి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి స్మార్టు మీటర్ల గండం పొంచి ఉందని మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ అన్నారు. 2001 విద్యుత్ పోరాట చరిత్ర చంద్రబాబు మర్చిపోవద్దని గుర్తు చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మంగళవారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లో నిరసన నిర్వహించారు. సీఐటీయూ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో విల్సన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగులగొట్టాలని పిలుపునిచ్చిన లోకేష్ నేడు భిన్నంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. నరేంద్ర మోదీ అండతో అదానీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను దోచుకునే విధంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతి కుటుంబం నుంచి రూ.17,000లతోపాటు పీక్ అవర్స్ పేరుతో అధిక చార్జీలను గుంజే విధానాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని తంగిరాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈపాటికే బిగించిన స్మార్ట్ మీటర్లతో చిన్న వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారని, చిన్న పరిశ్రమలు మూతపడితే.. ఉపాధి రంగంపై తీవ్ర ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ నాయకులు కె.ఎల్ది ప్రసాద్, ఖాదర్ బాషా, సీఐటీయూ నాయకులు తిరుపతిరెడ్డి, పట్టణ పౌర సంఘ నాయకులు బి.విజయ్‌కుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో కరీం, ఆదాము, నాగేశ్వరావు, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, సామియేల్ తదితరులు పాల్గొన్నారు.
శాసనమండలి మాజీ సభ్యుడు
జల్లి విల్సన్