‘ఉపాధి’ పథకంలో రూ.కోట్లు స్వాహా | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ పథకంలో రూ.కోట్లు స్వాహా

Aug 7 2025 7:18 AM | Updated on Aug 7 2025 7:44 AM

‘ఉపాధి’ పథకంలో రూ.కోట్లు స్వాహా

‘ఉపాధి’ పథకంలో రూ.కోట్లు స్వాహా

బల్లికురవ: ఉపాధి హామీ పథకం ఉన్నత లక్ష్యానికి అవినీతి మకిలి అంటుకుంటోంది. రూ.కోట్లను దర్జాగా కాజేసిన వ్యవహారంపై అంతా విస్తుపోతున్నారు. ప్రభుత్వం వలసలను నిరోధించి ప్రతి కూలీకి పని కల్పించాలన్న ధ్యేయంతో ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని బల్లికురవ మండలంలో అవినీతిమయం చేశారని బాపట్ల జిల్లా డ్వామా పీడీ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు ఏపీఓ కార్యాలయాలకే పరిమితం కావడం వల్లే అవినీతి చోటుచేసుకుందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో రూ. 12 కోట్లతో జరిగిన 645 పనులకు సంబంధించి బుధవారం స్థానిక పరిషత్‌ కార్యాలయం వద్ద బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. ఇందులో ఎన్నో విషయాలు బహిర్గతమయ్యాయి.

అడ్డగోలుగా మస్టర్లు

ఎస్‌ఆర్‌సీలు తులసీ నాయక్‌, సుధీర్‌కుమార్‌, ఆడిట్‌ ప్రోగ్రాం మేనేజర్‌ సునీల్‌ పర్యవేక్షణలో డీఆర్‌పీలు జూలై 18 నుంచి 31వ తేదీ వరకు 21 గ్రామ పంచాయతీల్లో సామాజిక తనిఖీలు, గ్రామ సభలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఉపాధి సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, చదువుకునే విద్యార్థులు, చనిపోయిన వారికి, ప్రజాప్రతినిధులకు మస్టర్‌లు వేశారని తేలింది. మొక్కలు పెంపకం చేపట్టినట్లు రికార్డులో చూపారని వెల్లడైంది. ఆ గ్రామాల్లో ఒక్క మొక్క కూడా కనిపించలేదని తనిఖీ బృందాలు గుర్తించాయి. ప్రతి పంచాయతీలో రూ. 20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అవినీతి జరిగినట్లుగా గుర్తించారు. మల్లాయపాలెం మాజీ సర్పంచ్‌ అబ్బారెడ్డి బాలకృష్ణ 70 మందికి బోగస్‌ మస్టర్‌ వేసి రూ. 20 లక్షల మేర స్వాహా చేశారని కలెక్టర్‌కు డ్వామా పీడీ ఫిర్యాదు చేశారు. అనంతరం జూలై 30వ తేదీన సంయుక్త కలెక్టర్‌ నాగిరెడ్డి కొమ్మినేనివారిపాలెం, వైదన ఎస్‌ఎల్‌ గుడిపాడు గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. గతంలో చేపట్టిన పనులనే తిరిగి చేసినట్లు రికార్డుల్లో చూపి అవినీతికి పాల్పడ్డారని గుర్తించారు. 21 పంచాయతీలో అవినీతిపై నివేదికలను తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు చెప్పారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రజావేదిక రాత్రి 7 గంటల వరకు సాగింది. కొప్పరపాలెం, కొమ్మినేనివారిపాలెం, ముక్తేశ్వరం గ్రామాల పనులపై విచారణ పూర్తి అయ్యేందుకే 8 గంటల సమయం పట్టింది.

అన్ని పంచాయతీల్లో విచారణ చేపట్టాలి

బల్లికురవ మండలంలో ఉపాధి హమీ పథకం పనుల్లో రూ. 3 కోట్ల మేర అవినీతి జరిగిందని.. అన్ని పంచాయతీల్లో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని సీఐటీయూ నాయకుడు తంగిరాల వెంకటేశ్వర్లు బుధవారం పీడీకి వినతి పత్రం అందజేశారు. మిగిలిన 18 పంచాయతీలలో కూడా విచారణ తర్వాత ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన వారి నుంచి రికవరీ చేయాలన్నారు. వారిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రజావేదికలో జిల్లా విజిలెన్స్‌ అధికారి చంద్రశేఖర్‌, ఎంపీడీవో కుసుమకుమారి, పంచాయతీ రాజ్‌ ఏఈ మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బల్లికురవలో డ్వామా పీడీ విజయలక్ష్మి అసహనం చనిపోయిన వారికి, ఉద్యోగుల పేరిట మస్టర్లు వేసి నగదు కాజేసిన సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement