
కష్టాల ‘నేత’... కన్నీటి వెత
చీరాల: అగ్గిపెట్టెలో పట్టేలా పట్టు చీరలు నేసిన చరిత్ర వారిది. అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అందమైన చీరలు నేసే ఆ చేతులు నేడు మట్టి పని కోసం వెంపర్లాతున్నాయి. బతుకు కోసం తరతరాలుగా నమ్ముకున్న మగ్గానికి దూరమవుతున్నారు. కుటుంబ సభ్యుల కడుపు నింపేందుకు సిమెంట్, ఇటుకరాళ్లు మోసేందుకు పరుగులు పెడుతున్నారు. కులవృత్తిపై నమ్మకం వదిలి పరాయి వృత్తుల్లో కొందరు వంట పని, షెడ్డుల్లో లారీ క్లీనర్లుగా, కొందరు బారుల్లో సర్వర్లుగా, పెట్రోల్ బంకుల్లో రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. శ్రమకు తగ్గ మజూరీలు లేక పట్టణాల్లో కూలీలుగా తయారయ్యారు చేనేత కార్మికులు.
కూటమి పాలనలో దుర్భరం
చీరాలతోపాటు పొద్దుటూరు, ధర్మవరం, జమ్మలమడుగు, పెడన, ఐలవరం, బద్వేలు, ఆత్మకూరు, తాటిపర్తి వంటి ప్రాంతాల నుంచి 40 ఏళ్ల క్రితం వలసలు వచ్చిన కార్మికులు స్థానికంగా మాస్టర్‌వీవర్లకు సంబంధించిన చేనేత షెడ్డుల్లోని మగ్గాలపై పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బాపట్ల జిల్లాలో చీరాల, పర్చూరు, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలో సుమారు 15 వేల మగ్గాల వరకు ఉన్నాయి. 20 వేల చేనేత కుటుంబాల వారున్నారు. వీరిలో మొత్తం 50 శాతం మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీరు బతులు మరింత దుర్భరంగా మారాయి. కనీస వేతనం కూడా దక్కడం లేదు.
న్యాయమైన డిమాండ్లు ఎన్నో..
చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించింది. రంగు, నూలు, రసాయనాలపై 29 శాతం జీఎస్టీ విధించడంతో చేనేత రంగం కోలుకోలేని దెబ్బతగిలింది. కూటమి ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించింది. సంక్షేమ పథకాలు అమలు కావడంలేదు. రూ.700 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తే ప్రయోజనమని ఆ వర్గం వాపోయింది. ఐసీఐసీఐ లాంబాడ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని కేంద్రం నిలిపివేసింది. ఈ పథకాన్ని కేంద్రం పునరుద్ధరించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చేనేత ఆత్మహత్యలకు నేటికి ఎక్స్‌గ్రేషియా రూ.10లక్షలు అందించలేదు. కూటమి ప్రభుత్వం వీటిని వెంటనే అందించాలని బాధితులు కోరుతున్నారు. చీరాలలో టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తానని గతంలో చంద్రబాబు ప్రకటించారు. దీనివలన చేనేతలకు ప్రయోజనం లేదు. దీనిని చేనేత పార్కుగా మార్చాలని కార్మికులు కోరుతున్నారు. ఆప్కో ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి చేనేతల ద్వారా వస్త్రాలను నేయిస్తే ప్రయోజకరమని చెబుతున్నారు. కార్మికశాఖలో అవకాశం కల్పిస్తే కార్మికుల్లా ప్రయోజనాలు పొందుతారని పేర్కొన్నారు. చేనేత ప్రాంతాల్లో వారికి నూలు రాయితీపై ఇవ్వాల్సి ఉంది. తమిళనాడులోని చేనేత కార్మికులను ఆదుకునేలా పలు విధానాలు ఉన్నాయి. అవి ఇక్కడ అమలు చేయాల్సి ఉంది. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కొరవడింది.
ఉచిత విద్యుత్, నేతన్న నేస్తం అమలేదీ?
‘‘చేనేతలంటే నాకు చాలా ఇష్టం. వారి కష్టంతో కూడిన కళానైపుణ్యం ఉంది. వారికి అండగా నేనున్నా’’ అని సీఎం చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. అయితే నేతన్నలకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25,000 ఇస్తామని చెప్పినా ఇంతవరకు అతీగతీ లేదు. కనీసం ఈ ఏడాదైనా ఇస్తారా? అని కార్మికులు ఎదురుచూస్తున్నారు.
మరిన్ని నిధులు కేటాయించాలి
చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించింది. రంగు, నూలు, రసాయనాలపై 29 శాతం జీఎస్టీ విధించడంతో చేనేత రంగానికి కోలుకోలేని దెబ్బతగిలింది. కూటమి ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించింది. హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని నిలిపివేయడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం దీనిని పునరుద్ధరించాలి.
– దేవన వీరనాగేశ్వరరావు,
చేనేత జనసమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
చేనేత కార్మికులపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం నానాటికీ తీవ్ర ఇబ్బందుల్లోకి నేతన్నలు నేడు జాతీయ చేనేత దినోత్సవం