
విఘ్నేశ్వరాయ.. వివిధ రూపాయ..!
చలువ పందిళ్లలో కొలువుదీరేందుకు గణనాథుడు సిద్ధమవుతున్నాడు. వినాయకచవితి పండుగకు వివిధ రూపాల్లో గణపయ్య చక్కగా ముస్తాబవుతున్నాడు. బోలో గణేశ్ మహారాజ్ కీ జై.. అనే భక్తుల నినాదాలతో ఆనందపడేందుకు కొలువుదీరబోతున్నాడు.
బాపట్ల అర్బన్: వినాయక చవితిని పురస్కరించుకుని బొజ్జ గణపయ్య విగ్రహాలు సిద్ధం అవుతున్నాయి. వినాయక రూపాలను తీర్చిదిద్దడంతో కళాకారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాపట్ల పట్టణంలోని కర్లపాలెం రోడ్డులో మార్కెట్ యార్డు ఎదుట విగ్రహాల తయారవుతున్నాయి.
ఊరూవాడా పండగే..
వినాయక చవితి పండుగ సందర్భంగా ఊరూవాడా గణనాథుని విగ్రహాలు కొలువుదీర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి వీధిలో విగ్రహాలు ప్రతిష్టించి భజనలు, పూజలు చేసేందుకు భక్తులు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ఆకృతుల విగ్రహాలకు డిమాండ్ బాగా పెరిగింది. వీటి తయారీలో కళాకారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మట్టి సేకరణ నుంచి రంగుల వరకు ఎంతో శ్రద్ధ పెడుతున్నారు. విగ్రహాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగిస్తారు. దీంతోపాటు పీచు, కర్ర, రంగులు కూడా వాడుతుంటారు. ఒక మాదిరి విగ్రహం తయారీకి సుమారు ఎనిమిది మంది దాదాపు వారం రోజులు పని చేస్తారు.
పెరిగిన ఖర్చులు
గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బస్తా రూ.150 ఉండేదని, ఇప్పుడు దాని విలువ రూ.300కు పెరిగిందని తయారీదారులు అంటున్నారు. విగ్రహాల తయారీని ఆరు నెలల ముందు నుంచే ప్రారంభిస్తామన్నారు. చవితి సమయానికిగానీ విగ్రహాలు విక్రయానికి సిద్ధం అవుతాయని తెలిపారు. వర్షాలు కురిసినప్పుడు కొంత ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూలి గిట్టుబాటవుతుందని చెబుతున్నారు.
విగ్రహానికి రంగులు వేస్తున్న దృశ్యం
చవితికి సిద్ధమవుతున్న గణనాథులు వైవిధ్య ఆకృతుల్లో రూపొందిస్తున్న తయారీదారులు

విఘ్నేశ్వరాయ.. వివిధ రూపాయ..!