
సైబర్ వలలో సామాన్యులు
చీరాల: వేటపాలెం మండలం దేశాయిపేట పంచా యతీలోని దంతంపేటకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతని వాట్సప్‌కు వచ్చిన మెసేజ్ క్లిక్ చేసి చూడగా అందులో ఉన్న ఓ ప్రొడక్ట్‌ను క్లిక్‌చేసి స్క్రీన్ షాట్ తీసి పంపించాలని ఉంది. అతడు అలానే చేయగా ముందుగా రూ.150 బ్యాంకు ఖాతాకు జమ చేశా రు. ప్రొడక్ట్‌లను క్లిక్‌చేస్తే టాస్క్‌లు వస్తాయని నమ్మబలికారు. నగదు జమ అవుతుందని భావించిన అతడు వారు చెప్పినట్లుగా చేశాడు. చిన్నచిన్న అ మౌంట్‌లను సైబర్ నేరగాళ్లు అతని అకౌంట్‌లో జమ చేశారు. బాధితుడు పూర్తిగా వారిని నమ్మాడని నిర్ణయించుకుని తర్వాత విడతల వారీగా రూ.10 లక్షల వరకు దోచుకున్నారు.
● వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ఓ వ్యక్తి ఇంజినీరింగ్ కాలేజిలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. సైబర్ నేరగాళ్లు అతనికి ఒక లింక్ పంపించి క్లిక్ చేస్తే ప్రైజ్‌మనీ వస్తుందని మభ్యపెట్టారు. కొంత నగదు అకౌంట్‌లో జమ కావడంతో నకిలీ వెబ్‌సైట్ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి రూ.30 లక్షలు కాజేశారు.
● చీరాల పట్టణంలో ఓ అంగన్‌వాడీ కార్యకర్తకు హెల్త్ డిపార్టుమెంట్ పేరుతో కాల్ వచ్చింది. గర్భిణులకు, బాలింతలకు జననీ సురక్ష కింద ముఖ్యమంత్రి రూ.15 వేలు ఇస్తున్నారని అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదారుల ఫోన్ నెంబర్లు ఇవ్వాలని కోరడంతో ముగ్గురి నెంబర్లు ఇచ్చారు. ఆ తర్వాత ముగ్గురికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు వాట్సప్ పే ద్వారా ముగ్గురి అకౌంట్ల నుంచి రూ.1.70 లక్షలు కాజేశారు.
● వేటపాలెం మండలం పాపాయిపాలేనికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి యాక్సిడెంట్ ఫొటోలు వాట్సప్‌లో వచ్చాయి చూడమని చెప్పాడు. దీంతో ఏం జరిగిందోనని అతడు వాట్సప్‌లో చూడగా ఫొటోలు కనిపించలేదు. కొద్ది నిమిషాల్లో అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయినట్లుగా మెసేజ్‌లు వచ్చాయి. విడతల వారీగా రూ.5.72 లక్షలు డెబిట్ అయ్యాయి. ఇవన్నీ కొంత కాలంగా చీరాల నియోజకవర్గంలో జరిగి వెలుగులోకి వచ్చిన ఘటనలు. ఇలా ఎంతో మంది సైబర్ మోసాలకు బలవుతున్నారు. కొందరు తమకు జరిగిన మోసంపై మిన్నకుండిపోతున్నా మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
నిరక్ష్యరాస్యులు మొదలుకొని..
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం కొంత పుంతలు తొక్కుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇదే సాంకేతికతను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు సామాన్యుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. నిరక్షరాస్యులతోపాటు టీచర్లు, ఉద్యోగులు, వ్యాపారులు సైతం మోసపోయి చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరాలకు పాల్పడే వాళ్లు ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు చేస్తున్నారు. మోసపోయిన వారు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులు ఇక్కడి వారు కాకపోవడంతో గుర్తించడం కష్టతరమని పోలీసులు చెప్తున్నారు.
కొత్త పుంతలు తొక్కుతున్నారు...
బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందని, ఏటీఎం యా క్టివేషన్ చేయాలని బ్యాంకు నుంచి ఫోన్లు చేస్తున్నట్లుగా చేసి ఖాతాదారుని వివరాలు సేకరిస్తున్నారు. ఫేక్ ప్రొఫైల్ ఫొటోను మార్ఫింగ్ చేసి స్నేహితులు, బంధువులకు ఫేక్ మెసేజ్‌లు పంపుతున్నారు. ఫేస్‌బుక్‌లో స్నేహితులు, బంధువులు అడిగినట్లుగా నగదు పంపించాలంటూ మెసేజ్‌లు రావడంతో నిజమేనని అనుకొని కొందరు నగదు బదిలీ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఎవరిని అడగాలో ఏంచేయాలో తెలియక లబోదిబోమంటున్నారు.
మాయమాటలతో ట్రాప్ పలు రకాలుగా ఫోన్లు నమ్మితే ఖాతాలో నగదు మాయం
సైబర్ నేరాల పట్ల
అప్రమత్తతగా ఉండాలి..
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వచ్చినా, లింక్‌లు పంపినా వాటిని తెరవవద్దు. లింక్‌పై క్లిక్ చేస్తే ఖాతాదారుని వివరాలను హ్యాక్ చేసి ఖాతాలోని నగదు మాయం చేస్తారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీలు ఎవరితోనూ షేర్ చేయవద్దు.బ్యాంకు మేనేజర్లతో సమావేశం నిర్వహించాం. సైబర్ నేరాల పట్ల ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం.
– ఎం.మోయిన్, డీఎస్పీ, చీరాల