
మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి వినూత్న శిక్ష
మూడు రోజులు కోర్టు పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి
చీరాల రూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 10 మందికి బాపట్ల జిల్లా చీరాల అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జె.కాత్యాయని వినూత్నమైన శిక్ష విధించారు. మూడు రోజులపాటు కోర్టు పరిసరాలను పరిశుభ్రం చేయాలని గురువారం ఆదేశించారు. చీరాల వన్‌టౌన్ సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు... చీరాల పట్టణంలోని అనేక ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి కాత్యాయని నిందితులు ఒక్కొక్కరు రూ.10,000 జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్ష అనుభవించాలని తీర్పుచెప్పారు. అయితే, ఈ కేసులోని నిందితులందరూ కూలి పనులు చేసుకునేవారిమని, తమ వద్ద డబ్బులు కట్టేంత ఆర్థిక స్థోమత లేదని న్యాయమూర్తిని వేడుకోవడంతో స్పందించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి నిందితులందరూ మూడు రోజుల పాటు కోర్టు ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. వారిలో పరివర్తన రావాలనే ఉద్దేశంతోనే కోర్టు పరిసరాలను శుభ్రం చేయిస్తున్నామని, కోర్టుకు వచ్చే కక్షిదారులు కూడా వారిని చూసి మార్పు చెందుతారని న్యాయమూర్తి అన్నారు. అయితే, ఇటువంటి కేసులలో పట్టుబడి మళ్లీ కోర్టుకు వస్తే ఈసారి కచ్చితంగా జైలుకు పంపిస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలపాలై జీవితాలను పాడుచేసుకోవద్దని న్యాయమూర్తి హితవు పలికారు.