
వైఎస్సార్ సీపీ నేత ‘వరికూటి’ జలదీక్ష
వేమూరు: మురుగు కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోయి నీటి పారుదల కావడం లేదని, వర్షాలు కురిస్తే 3,000 ఎకరాలు మునిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. గుర్రపు డెక్క తొలగించాలని కోరుతూ భట్టిప్రోలులోని మురుగు కాలువల్లో గురువారం ఆయన జలదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోయిందన్నారు. గత నెలల్లో కురిసిన వర్షాలకు నీటి పారుదల లేక రైతులు వెద సాగు పద్ధతిలో చేసిన పంట మునిగిపోయిందని తెలిపారు. వేమూరు మండలం పోతుమర్రులోని రేపల్లె డ్రెయిన్‌లో గుర్రపు డెక్కలోకి దిగి నాలుగు గేదెలు మునిగి పోయి మృతి చెందాయని తెలిపారు. జూలై 19న మురుగు కాలువల్లో దిగి గుర్రపు డెక్క తొలగించాలని నిరసన వ్యక్తం చేశామని గుర్తు చేశారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో మరోసారి జల దీక్ష చేపట్టినట్లు తెలిపారు.
మట్టిని బొక్కుతున్న కూటమి నాయకులు
కూటమి నాయకులు నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టి అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఇసుకను హైదరాబాద్ వరకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుర్రపు డెక్క తొలగించే వరకు దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జలదీక్ష చేస్తున్న ప్రాంతానికి డ్రెయినేజీ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ కల్యాణబాబు వచ్చి అశోక్‌బాబుతో మాట్లాడారు. గుర్రపు డెక్క తొలగించేందుకు, మురుగు కాలువ మరమ్మతుల కోసం ప్రభుత్వానికి రూ.20 లక్షలకు అంచనాలు పంపామని తెలిపారు. గుర్రపు డెక్క మందు కూడా పిచికారీ చేసినట్లు చెప్పారు. పది గంటల్లోపు తొలగిస్తామని ఆయన అశోక్‌బాబుకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అనుమతి ఇస్తే రైతులు చందాలు వేసుకొని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భట్టిప్రోలు నుంచి రేపల్లె డ్రెయిన్ వరకు గుర్రపు డెక్క తొలగిస్తామని, దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పటమటి శ్రీనివాసరరావు, దాది సుబ్బారావు, గొట్టిపాటి శ్రీనివాసరావు, అనపురెడ్డి రఘురామిరెడ్డి, రైతు విభాగం నాయకులు గాదె శివరామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు ఈద శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, నియోజకవర్గం అధ్యక్షులు గోపాలం రాము, భట్టిప్రోలు ఎంపీపీ లలితకుమారి, దాట్ల మోహన్‌రెడ్డి, పెరికల పద్మారావు, షేక్ హుస్సేన్, బొల్లెదు ప్రతాప్, జల్లి జోషి కాంత్, పెద్దబుజ్జి, సిరాజ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
గుర్రపు డెక్క తొలగించాలని డిమాండ్

వైఎస్సార్ సీపీ నేత ‘వరికూటి’ జలదీక్ష