
పప్పు లేదు.. బియ్యంతోనే సరి !
● ఆగస్టులో కూడా అందని కందిపప్పు ● లబోదిబోమంటున్న కార్డుదారులు ● పండుగల నెలలో కూడా కనికరం లేని కూటమి సర్కార్
చీరాల టౌన్: ఆగస్టులో పండుగలు ఎక్కువగా ఉన్నాయి. వినాయకచవితి, కృష్ణాష్టమి, వరలక్ష్మీ వ్రతం తదితర ముఖ్యమైన పండుగలు ఉన్నా పేదలపై కూటమి సర్కార్‌కు కనికరం కూడా లేదు. పండుగ రోజు పప్పు వండుకునేందుకు కూడా అవకాశం లేదు. కార్డుదారులకు ఈ నెల కూడా కందిపప్పును కూడా అందించలేకపోతోంది. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారం చేపట్టినప్పటి నుంచి బియ్యం, పంచదారతో పంపిణీతోనే మమ అనిపిస్తోంది.
తూతూమంత్రంగా రేషన్ పంపిణీ
కూటమి ప్రభుత్వం అనేక హామీలతో అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ పథకాల అమలు ఊసే లేదు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం కందిపప్పును కూడా అందించలేక పోతోంది. ఆగస్టులో కూడా కేవలం బియ్యం, పంచదారతోనే సరిపెట్టనుంది.
జిల్లాలో 4,88,000 రేషన్ కార్డులు
బాపట్ల జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 4,88,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఏడు
ఎంఎల్‌ఎస్ పాయింట్లు నుంచి జిల్లాలోని 1,123 రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందిస్తారు. జిల్లావ్యాప్తంగా 7000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, గోధుమ పిండి కూడా అందించాలి. అయితే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యంతోనే సరిపెట్టింది. పండుగలు అధికంగా ఉన్న ఆగస్టులో కూడా కూటమి ప్రభుత్వం బియ్యం, పంచదారతోనే సరిపెట్టనుంది.
వైఎస్సార్ సీపీ పాలనలో ఇంటి దగ్గరకే సరుకులు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారుల ఇంటి దగ్గరకు బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేశారు. ఇంటి ముందుకే రేషన్ సరుకులు రావడంతోనే వృద్ధులు, దివ్యాంగులు ఆనందించారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకులు అన్నీ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తర్వాత కందిపప్పు, గోధుమ పిండికి కోత విధించింది. కంటి తుడుపు చర్యగా జిల్లాలోని కార్డుదారులకు అరకిలో చొప్పున 2300 టన్నుల పంచదారతోనే సరిపెడుతోంది.
ప్రభుత్వం విడుదల చేయలేదు
ప్రభుత్వం ప్రస్తుతానికి బియ్యం, పంచదారనే అందిస్తోంది. కందిపప్పు ఇవ్వడం లేదు. ఈ నెలకు సరిపడా ఎంఎస్‌ఎల్ పాయింట్ల నుంచి బియ్యం, పంచదారను రేషన్ దుకాణాలకు పంపించాం. కందిపప్పు వస్తే కార్డుదారులకు అందిస్తాం.
–బాషా, జిల్లా పౌరసరఫరాల శాఖ
అధికారి, బాపట్ల