
భర్త చిత్రహింసలపై ఫిర్యాదు
నగరంపాలెం: ఎమ్మెల్యే వద్ద ఉంటున్న భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. పొన్నూరు మండలం ఆలూరు గ్రామానికి చెందిన పేర్ల వెంకటేశ్వరమ్మ, ఆమె తల్లి నంబూరు లక్ష్మి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లో మళ్లీ ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో వెంకటేశ్వరమ్మ మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల కిందట పౌల్‌రాజుతో ప్రేమ వివాహామైంది. భర్త పంచాయతీరాజ్‌లో పనులకెళ్తూ, ప్రస్తుతం ఎమ్మెల్యే వద్ద ఉంటున్నాడు. పాండ్రపాడులోని రెండెకరాల పొలంలో ఎకరాన్ని ఆరేళ్ల కిందట రూ.19 లక్షలకు విక్రయించాడు. మిగతా ఎకరం కూడా విక్రయించేందుకు నాపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై హింసకు గురిచేస్తున్నాడు. ఈనెల 11న మరణాయుధంతో దాడికి పాల్పడగా, ప్రాణాలతో బయటపడ్డాను. కుమార్తె సేవిత భర్త వద్దనే ఉంటుంది. ప్రస్తుతం నా భర్త, మరో రౌడీషీటర్‌తో కలసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత నెల్లో డీపీఓ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అతనిపై ఫిర్యాదిచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుతం మళ్లీ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీంతో చేసేది లేక మరలా ఫిర్యాదు చేసేందుకు వచ్చామని బాధితురాలు వెంకటేశ్వరమ్మ, ఆమె తల్లి లక్ష్మి వాపోయారు. పాపను నాకు అప్పగించాలని, భర్త నుంచి రక్షణ కల్పించాలని భార్య వెంకటేశ్వరమ్మ మీడియా ఎదుట వేడుకుంది.