
అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి
ఎస్పీ తుషార్ డూడీ
బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 60 మంది అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలకు సంబంధించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, చీరాల డీఎస్పీ మొయిన్, రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు, పీజీఆర్‌ఎస్ సెల్ సీఐ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.