
వేతనాలు అందక ఉపాధ్యాయులకు అవస్థలు
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీ అయిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కోర్టు వద్ద ఉన్న సంఘ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీ–అపోర్షన్మెంట్ గురైన ఉపాధ్యాయులతో పాటు అప్ గ్రేడ్, డీ–గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలల్లోని వేలాది మంది ఉపాధ్యాయులకు మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు అందని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఫలితంగా బ్యాంకు, వ్యక్తిగత రుణ చెల్లింపులు, కుటుంబ ఖర్చులు భారంగా మారాయని పేర్కొన్నారు. విధులకు డెడ్‌లైన్ విధించి, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న విద్యాశాఖాధికారులు వేతనాల చెల్లింపుల్లో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉపాధ్యాయ ఖాళీల్లో డీఎస్సీ నియామకాలు చేపట్టే వరకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని కోరారు. ఇంటర్మీడియట్ తరగతులు బోధిస్తున్న ప్లస్ టూ పాఠశాలల్లోని సబ్జెక్ట్ టీచర్స్ ఖాళీల్లో పీజీ అర్హత గల ఉపాధ్యాయులను తాత్కాలికంగా నియమించి, విద్యా ప్రమాణాలు పడిపోకుండా చూడాలని తెలిపారు. గతంతో పోల్చితే యాప్స్ భారం పెరిగిందని, తక్షణమే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కటీ ఆన్‌లైన్‌లో నమోదు చేయమంటూ, ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడం తగదని ఖండించారు. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించి, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు రూ.25వేల కోట్ల మేరకు పేరుకుపోయాయని, మూడేళ్లుగా చెల్లింపులు లేక సరెండర్ లీవ్ బిల్స్ మూలన పడ్డాయని తెలిపారు. తక్షణమే ఆయా బకాయిలను చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత గల ఎస్జీటీ, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరారు. ఎంఈవోల బదిలీలు చేపట్టి, కామన్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నాడు–నేడు పనులను పూర్తి చేయాలని కోరారు. పలు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు సరిపడా విద్యార్థులకు అందలేదని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు జి.దాస్, ఎస్.ఎస్.ఎన్ మూర్తి, బి.సాయి లక్ష్మి, పి.నాగశివన్నారాయణ, జిల్లా కౌన్సిలర్లు గురుమూర్తి, ముని నాయక్, షేక్ షూకూర్, సుబ్బారావు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు