
పేదరిక నిర్మూలనకు చేయూత
చీరాల: పీ 4 ద్వారా గుర్తించిన బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెచ్చేలా ఆర్థిక చేయూత ఇవ్వాలని కలెక్టర్ వెంకటమురళి అన్నారు. పీ 4, సూర్య ఘర్, చేనేతల అభివృద్ధి అంశాలపై శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేదరికంలో జన్మించిన అంబేడ్కర్‌కు సహాయం అందించడంతోనే ఆయన ఉన్నత విద్యనభ్యసించి, మహనీయుడిగా ఎదిగి రాజ్యాంగాన్ని రచించారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మార్గదర్శిలు సహాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెరుకుపల్లిలో నిరుపేదలైన 10 యానాది కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. చీరాల నియోజకవర్గంలో 8405 బంగారు కుటుంబాలు ఉండగా 4400 కుటుంబాలకు 402 మార్గదర్శిలను అనుసంధానించామని వివరించారు. మిగిలిన వారికి మార్గదర్శిలను గుర్తించాలన్నారు. చేనేతల ఆర్థిక అభివృద్ధికి విరివిగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. మానవతా దృక్పథంతో చేనేతలందరికీ ముద్ర రుణాలు మంజూరు చేయాలని తద్వారా చేనేతల జీవనోపాధి పెరుగుతుందన్నారు. అలానే పర్యావరణానికి ఎలాంటి నష్టం లేని సౌర విద్యుత్ కోసం రుణాలు ఇవ్వాలన్నారు. 1695 దరఖాస్తులు రాగా 327 యూనిట్లు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కుప్పడం పట్టుచీరలకు జాతీయ గుర్తింపు అవార్డు లభించడంతో చేనేత రంగం మరింత అభివృద్ధి కానుందన్నారు. ఈ గుర్తింపును చేనేతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుప్పడం చీరాల ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు బాపట్ల, చీరాల, వాడరేవు, సూర్యలంక బీచ్‌ల వద్ద ఓడీపీఓ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్కానర్ ఏర్పాటు ద్వారా చీరాల కుప్పడం చీరల చరిత్ర తెలుసుకునేలా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తామన్నారు. చీరాల మండలం దేవాంగపురిలో 26 ఎకరాల విస్తీర్ణంలోని హ్యాండ్‌లూమ్ పార్కును హ్యాండ్లూమ్ ఎంఎస్‌ఎంఏగా ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి అంగీకరించిందని తెలిపారు.
జిల్లా ప్రజలకు గర్వకారణం
చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ కుప్పడం చీరలకు జాతీయ అవార్డు రావడం జిల్లా ప్రజలకు గర్వకారణంగా ఉందన్నారు. అలాంటి చేనేతల వృత్తికి అవసరమైన రుణాలు విరివిగా అందించాలన్నారు. సూర్యఘర్ పథకం కింద ఆగస్టు 15లోగా వెయ్యి గృహాలకు సౌర విద్యుత్ అందించాలన్నారు. అనంతరం స్థానిక చేనేత కళాకారులను సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న కలెక్టర్‌ను చీరాల ఎమ్మెల్యే, చేనేత కార్మికులు కలిసి సత్కరించారు. మెప్మా పరిధిలోని 30 డ్వాక్రా సంఘాలకు రూ.6 కోట్లు రుణాల, వెలుగులోని 40 డ్వాక్రా సంఘాలకు రూ.7 కోట్లను చెక్కుల రూపంలో కలెక్టర్ పంపిణీ చేశారు. ముందుగా చేనేతరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో చీరాల ఆర్డీఓ టి.చంద్రశేఖర్‌నాయుడు, మున్సిపల్ చైర్మన్ ఎం.సాంబశివరావు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, సీపీఓ షాలెంరాజు, చేనేత జౌళి శాఖ ఏడీ రఘునంద, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు.
కుప్పడం పట్టుచీరకు దక్కిన
అవార్డు చేనేత కళాకారులకు అంకితం
చీరాల, బాపట్ల తీర ప్రాంతంలో
ఓడీపీఓ స్టాల్స్ ఏర్పాటు
హ్యాండ్‌లూమ్ పార్కుతో చేనేతలకు
ప్రోత్సాహం
కలెక్టర్ వెంకటమురళి