
మిషన్ గ్రీన్ గుంటూరు లోగో డిజైన్లకు ఆహ్వానం
నెహ్రూనగర్: స్వచ్ఛ గుంటూరు – క్లీన్ గుంటూరు కాన్సెప్ట్‌లో మిషన్ గ్రీన్ గుంటూరు నినాదంతో లోగో కోసం డిజైన్లను ఆహ్వానిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బెస్ట్ డిజైన్‌గా ఎంపికై న డిజైనర్‌కు నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందిస్తామని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ సీజన్‌లో దశలవారీగా 5 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో వార్డులవారీగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణహిత గుంటూరే లక్ష్యంగా పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య పనులలో మెరుగుదల, వ్యర్థాలను తడిపొడిగా వేరు చేసి తీసుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, విక్రయం నిషేధం, నగరంలోకి వచ్చే ప్రధాన మార్గాలు, జంక్షన్లు, ఐలాండ్స్, పార్క్‌లు, డివైడర్లపై పచ్చదనం పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ మోడ్‌లో క్షేత్రస్థాయి నుంచి అమలుకు కృషి చేస్తామని తెలిపారు. అందులో భాగంగా చేపట్టిన మిషన్ గ్రీన్ గుంటూరుని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా డిజైన్‌లు ఆహ్వానిస్తున్నామన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్, పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలతో ఆగస్ట్ 15వ తేదీలోపు నగరపాలక సంస్థ వాట్సాప్ నంబర్ 98499 08391కు పంపవచ్చని తెలిపారు. ఆగస్ట్ 15 అనంతరం ఉత్తమ డిజైన్ ఎంపిక ఉంటుందన్నారు.
ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు జరిగి రెండు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం సరికాదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్‌లు అన్నారు. వేతన చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ డీఏలు, పీఆర్సీపై ప్రభుత్వం నోరు మెదపటం లేదన్నారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల జీతాల విషయంలో తాత్సారం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు. రోజూ రకరకాల అప్‌లోడ్ పనులతో టీచర్లను బోధనకు దూరం చేస్తున్నారని, ఇది పరోక్షంగా ప్రభుత్వ విద్యను కాలరాయడమే అన్నారు. అనంతరం డీవైఈవో ఏసురత్నంకు వినతి పత్రం సమర్పించారు. నిరసన ప్రదర్శనలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందు, బి.ప్రసాదు, ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్ కుమార్, గుంటూరు నగర అధ్యక్షుడు ఎం. చిన్నయ్య, మండల శాఖ నాయకులతోపాటు బదిలీ అయిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.