
నత్తనడకన గుండ్లకమ్మ బ్రిడ్జి నిర్మాణం
బల్లికురవ: గుండ్లకమ్మ వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. దీంతో ఇటువైపు ప్రజలు అటు.. అటు వైపు ప్రజలు ఇటు వెళ్లే వీలు లేక అల్లాడిపోతున్నారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఏడేళ్లు అవుతున్నా కూటమి సర్కారు దానిని పూర్తి చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో వాహనచోదకులు, ప్రజలకు అవస్థలు తప్పటంలేదు. 2018లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బల్లికురవ మండలం వెలమవారిపాలెం పంచాయతీలోని కె.జమ్ములమడక కాలనీ సమీపంలో గుండ్లకమ్మను దాటేందుకు సీఆర్‌ఎఫ్‌లో రెండు లేయర్లు బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పిల్లర్లు, బీములు వేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. రెండేళ్లుగా పనుల ఊసేలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బల్లికురవ, సంతమాగులూరు, ముండ్లమూరు, దర్శి మండలాల్లోని 80 గ్రామాలకు కనెక్టివిటీతో రాకపోకలకు ఇబ్బందులు తొలుగుతాయి.
చుట్టూ తిరగాల్సిందే..
వంతెన పూర్తి కాని పరిస్థితుల్లో.. నాలుగు మండలాల్లోని ప్రజలు అద్దంకి మీదుగా రాకపోకలు సాగించాల్సి రావడంతో 40 నుంచి 50 కిలోమీటర్లు అదనంగా ప్రయాణిస్తూ వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఎండాకాలంలో మాత్రం బైక్‌లు, బాటసారులు గుండ్లకమ్మ నదిలోనే ప్రయాణించే అవకాశం ఉంది. వర్షాకాలంలో మాత్రం అది కుదరని పని.
ఉచిత ప్రయాణానికి అవకాశం
బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కారంచేడు, పర్చూరు, యద్దనపూడి, మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు, ముండ్లమూరు, దర్శి మండలాల్లోని 140 గ్రామాలను కలుపుతూ చీరాల, చిలకలూరిపేట డిపోల నుంచి పొదిలికి నేరుగా బస్సు వసతి కల్పించవచ్చు. కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉమ్మడి జిల్లాలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ ప్రకటిస్తోంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బస్సులో జిల్లా కేంద్రానికి నేరుగా వెళ్లవచ్చు. ప్రస్తుతం మూడు బస్సులు మారుతూ గంటల తరబడి నిరీక్షిస్తేనే గమ్యం చేరుకొనే పరిస్థితి. పిల్లర్లు, బీముల పనులు పూర్తి కాగా.. శ్లాబులేసి మార్జిన్‌లో గోడలు నిర్మిస్తే రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణం విషయమై ఆర్‌అండ్‌బీ ఏఈ బాబ్జిని వివరణ కోరగా బిల్లుల చెల్లింపులో జాప్యంతో పనులు నిలిచాయని తెలిపారు. పనులు పూర్తి చేయించి రాకపోకలకు ఇబ్బందులు తొలగిస్తామన్నారు.
ఏడేళ్లుగా సాగుతున్న పనులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 గ్రామాల ప్రజల అవస్థలు వర్షాకాలంలో రాకపోకలకు బ్రేక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే చీరాల–దర్శి– పొదిలికి నేరుగా బస్సు వసతి పట్టించుకోని కూటమి ప్రభుత్వం